అఖిలప్రియకు చంద్రబాబు మందలింపు
ఇటీవల టీడీపీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డిపై అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టినట్లు తెలుస్తోంది. అఖిలప్రియను సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు రాత్రి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఖిలప్రియను చంద్రబాబు మందలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరిక వల్ల భూమా విజయానికి పెద్దగా ఉపయోగం ఉంటుందని తాను అనుకోవడం లేదని అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. అన్ని ఛానళ్ల మైకుల వద్ద అఖిల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో సంయమనం అవసరం…..
అయితే గంగుల చేరికతో టీడీపీకి లాభమని ఒకపక్క మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతుంటే… అఖిలప్రియ అలా మాట్లాడటం సబబుకాదని కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అఖిలప్రియ కొంత ఉద్రేకానికి గురవుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో సంయమనమే ముఖ్యమని చంద్రబాబు అఖిలప్రియకు హితబోధ చేశారు. భూమా కుటుంబానికి, గంగుల కుటుంబానికి మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. ఆళ్లగడ్డలో పట్టున్న గంగుల ప్రతాపరెడ్డిని టీడీపీలోకి చేర్చుకోవడం అఖిలప్రియకు ఇష్టంలేదు. అయితే ఎన్నికల సమయంలో కొంత సర్దుబాటు ధోరణితో వ్యవహరించాల్సిన మంత్రి అఖిలప్రియ మీడియా ముందు బరస్ట్ అయ్యారు. దీన్ని చంద్రబాబు తప్పుపట్టారు. భూమా కుటుంబానికి రాజకీయంగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చంద్రబాబు ఈ సందర్భంగా అఖిలప్రియకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.








