ఆంధ్ర ప్రదేశ్ లో సాంకేతిక విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం – ప్రకాష్ జవదేకర్
ఆంధ్ర ప్రదేశ్ లో సాంకేతిక విద్యాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేయనున్నదని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామాత్యులు ప్రకాష్ జవదేకర్ హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో సాంకేతిక విద్యాభివృద్ధికి నిధులు విడుదల, గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీల ఏర్పాటుపై కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రి వై. ఎస్. చౌదరి, ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావులు కేంద్ర మానవ వనరుల శాఖామాత్యులు ప్రకాష్ జవదేకర్ ను న్యూ ఢిల్లీ లోని ఆయన నివాసంలో శుక్రవారం కలసి చర్చించారు.
ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, సెంట్రల్ యూనివర్సిటీ మంజూరు, గిరిజన ప్రజలు అధికంగా వున్న ఉత్తరాంధ్రలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు ఆవశ్యకత, నిధుల విడుదల గురించి కేంద్ర మానవ వనరుల మంత్రితో మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, గౌ. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా వున్న సమయంలోనే వారి అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ లో ఐఐటి లు, ఐఐఎం, త్రిపుల్ ఐటి లకు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల మంజూరుకు సమావేశం నిర్వహించి చర్చించడం జరిగిందని వివరించారు.
తిరుపతిలో ఐ ఐ టి., ఐసా ., పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిట్., విశాఖపట్నంలో ఐ ఐ ఎం., కర్నూలులో త్రిపుల్ ఐ టి., లు ఇప్పటికే తమ కార్యకలాపాల నిర్వహణ, తరగతుల నిర్వహణను ప్రారంభిచాయని , వీటికి అవసరమైన స్వంత భవనాలు, మౌలిక వసతులు కల్పించవలసిన ఆవశ్యకతను గురించి చర్చించడం జరిగిందని, ఈ మేరకు సమగ్ర నివేదికను రూపొందించి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పావారు. ఇప్పటికే తొలుత హామీ ఇచ్చిన అనుమతులు, మంజూరుల ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నదని కేంద్ర మంత్రి చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యాప్రగతికి అమలు చేస్తున్న విధానం ప్రశంసనీయంగా వున్నదని కేంద్ర మానవవనరుల శాఖామాత్యులు హర్షం వ్యక్తంచేశారు.








