అలాంటి వ్యక్తిని మరొకరితో పోల్చలేం : చంద్రబాబు
తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుండిపోయే గొప్ప సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బాలమురళీకృష్ణ వంటి వ్యక్తిని మరొకరితో పోల్చటం అసాధ్యమన్నారు. కర్ణాటక సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన బాలమురళీకృష్ణ ధ్యనుడని దేశ, విదేశాల్లో 25వేల కచేరీలు ఇవ్వటం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు. డాక్టర్ మంగళంపల్లి జయంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటైన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలమురళీకృష్ణ గొప్పదనాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనేదే తన లక్ష్యమన్నారు. వారి సంస్మరణార్థం తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తంలో ఒక మెమోరియల్ హాల్‌ను, సంగీత కళాశాలను, మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెమోరియల్ ఏర్పాటుకోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు సంగీత కళాశాలకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పేరును పెడుతున్నట్లు తెలిపారు. భద్రాచల రామదాసు కీర్తనలకు ప్రాచుర్యం కల్పించిన ఘనత బాలమురళీకృష్ణదేనన్నారు. సప్త స్వరాలను ప్రేమించి సంగీతాన్నే శ్వాసించిన రాగమహర్షి అని చంద్రబాబు అభివర్ణించారు.








