పుంగనూరులో విషాదం.. బైక్ ఇంజిన్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. మెకానిక్ చెప్పిన మాట విని రాత్రంతా బైక్ ఇంజిన్ ఆన్ చేసి ఉంచడంతో, ఆ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. త్యాగరాజు వీధికి చెందిన మురళి అనే వ్యక్తి శనివారం తన బైక్ ఇంజిన్ బోర్ చేయించి మెకానిక్ వద్ద నుంచి ఇంటికి తెచ్చాడు. ఇంజిన్ సెట్ అవ్వాలంటే రాత్రంతా స్టార్టింగ్లో ఉంచాలని మెకానిక్ సూచించడంతో, మురళి బైక్ను ఇంట్లోనే ఉంచి ఇంజిన్ ఆన్ చేశాడు.
ఆ సమయంలో ఇంటి తలుపులు మూసి ఉండటం, గాలి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో బైక్ నుంచి వెలువడిన విషపూరిత పొగ ఇల్లంతా వ్యాపించింది. కింద గదిలో నిద్రిస్తున్న మురళి తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, చందన ఆ పొగను పీల్చి నిద్రలోనే కన్నుమూశారు. మురళి అతని భార్య రేవతి ఇంటి పైన ఉన్న గదిలో పడుకోవడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి పిల్లలు, తండ్రి విగతజీవులుగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇరుకైన గదిలో వెంటిలేషన్ లేకపోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని స్థానికులు పోలీసులు తెలిపారు.








