ఎన్టీఆర్ జిల్లా పాలిటిక్స్ లో ట్విస్టులు..!!
ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ కొంతమంది నేతలకు సీట్లు నిరాకరిస్తుండడంతో నేతలు అలకపూనుతున్నారు. పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్లను బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నా వాళ్లు బెట్టు వీడటం లేదు. దీంతో నేతలు అటూఇటూ జంప్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీ మారడం తప్పదనే టాక్ జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. వీళ్లతో పాటు మరికొంతమంది నేతలు కూడా సేఫ్ జోన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
టీడీపీ నేత, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ తో కేశినేని నాని ఇవాళ సమావేశం కాబోతున్నట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన జగన్ తో సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. కేశినేని నాని తనతో పాటు తన అనుచరులకు కూడా సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. విజయవాడ నుంచి తాను మళ్లీ బరిలో ఉంటానని నాని ఇప్పటికే ప్రకటించారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి వైసీపీ కూడా గట్టి అభ్యర్థికోసం చూస్తోంది. నానికి విజయవాడ ఎంపీ సీటు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే తన కుమార్తె శ్వేతతో పాటు తన అనుచరులకు కూడా ఎమ్మెల్యే సీట్లు కావాలని నాని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వాళ్లకు సీట్లు ఇచ్చే పరిస్థితి వైసీపీలో కనిపించడం లేదు. ఈ విషయాలన్నింటిపై చర్చించేందుకే జగన్ తో భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. పెనమలూరు నుంచి మరోసారి బరిలోకి దిగాలని పార్థసారథి కోరుకున్నారు. అయితే ఆయనకు సీటు నిరాకరించారు సీఎం జగన్. పైగా జగన్ తీరుపై పార్థసారథి ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ను క్యాంప్ ఆఫీసుకు పిలిపించి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది అధిష్టానం. అయినా పార్థసారథి మెత్తబడలేదు. పార్టీలో ఉండి అవమానాలు భరిస్తూ ఉండడం కంటే టీడీపీలో చేరడం బెటర్ అని ఆయన తన అనుచరులతో చెప్పినట్టు తెలుస్తోంది. పార్థసారథి టీడీపీలో చేరితే నూజివీడు నుంచి బరిలోకి దింపేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. సంక్రాంతిలోపే ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో మరికొంతమంది నేతలకు కూడా స్థానచలనం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీలో టికెట్ల ఖరారు దాదాపు పూర్తి కావస్తోంది. ఇందులో సీట్లు దక్కని వాళ్లు టీడీపీ, జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తుండడంతో కొంతమంది కీలక నేతలు తమ స్థానాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాంటి నేతలు కొందరు వైసీపీలో చేరతారని సమాచారం. మొత్తానికి ఈ నెలలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.













