Fatty Liver: మహిళలకు ఫ్యాటీలివర్ ప్రభావం ఎక్కువా..?
భారత్ లో పెరుగుతోన్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా ఒకటి. భారత్ లో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) నిశ్శబ్ద అంటువ్యాధిగా మారింది. ది లాన్సెట్ రీజినల్ హెల్త్ ప్రచురించిన ఓ కథనంలో దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఫెనోమ్ ఇండియా-CSIR హెల్త్ కోహోర్ట్ నుండి వచ్చిన ఇటీవలి డేటా ప్రకారం.. భారత్ లో దాదాపు 38.9% మందికి ఫ్యాటీ లివర్ వ్యాధి ఉండవచ్చని అంచనా వేసారు. కాలేయం గట్టిపడటం లేదా ఫైబ్రోసిస్ సంకేతాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
సాంప్రదాయకంగా ఫ్యాటీ లివర్ అధిక ఆల్కహాల్ తీసుకోవడంతో ముడిపడి ఉన్నప్పటికీ, ఇటీవలి డేటా ఆల్కహాల్ అలవాటు లేకుండానే ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుతుందని గుర్తించారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి సాధారణ కారణాలు ఒకసారి చూస్తే.. NAFLD కి ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి ఊబకాయం. అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం, సరైన జీవనశైలి లేకపోవడం ఈ సమస్యలకు కారణంగా గుర్తించారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వుల వినియోగం పెరగడం వల్ల కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది.
తరచుగా ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్, దీని వలన అధిక కేలరీలు శరీరంలోకి వెళ్తాయి. టైప్ 2 డయాబెటిస్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులు NAFLD తో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. మధ్య వయస్కులైన పెద్దలలో NAFLD ఎక్కువగా కనిపిస్తుంది. కానీ జీవనశైలి కారణంగా యువ జనాభా ఎక్కువగా ప్రభావితమవుతుంది. కొన్ని మందులు కూడా ఫ్యాటీ లివర్ కు కారణం అవుతాయి. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), స్లీప్ అప్నియా మరియు హైపోథైరాయిడిజం వంటి పరిస్థితులు కూడా దీనికి కారణంగా చూడవచ్చు. ఫ్యాటీ లివర్ ప్రమాదం మహిళల్లో ఎక్కువగా కనపడుతోంది.













