First Aid: పాము కరిచిన తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీ ప్రాణాలు గాలిలో కలిసినట్లే!
First Aid: మన దేశంలో ముఖ్యంగా గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసే వారు తరచుగా పాము కాటుకు గురవుతుంటారు. పాము కరిచినప్పుడు కలిగే భయం, అవగాహన లేకపోవడం వల్ల చేసే చిన్న చిన్న తప్పులు ప్రాణాపాయానికి దారితీస్తాయి. పాము కరిచిన మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ అంటారు. ఈ సమయంలో మనం చేసే పనులే బాధితుడి ప్రాణాన్ని నిర్ణయిస్తాయి.
వెంటనే చేయాల్సిన పనులు:
ధైర్యం చెప్పడం: పాము కరిచిన వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురవుతారు. భయం వల్ల గుండె వేగం పెరిగి విషం త్వరగా శరీరమంతా వ్యాపిస్తుంది. అందుకే బాధితుడిని ప్రశాంతంగా ఉంచడం చాలా ముఖ్యం.
కదలికల నియంత్రణ :బాధితుడిని కదలకుండా పడుకోబెట్టాలి. కదలికలు పెరిగితే విషం రక్తంలో వేగంగా కలుస్తుంది.
బిగుతు వస్తువుల తొలగింపు: గాయం ఉన్న చోట వాపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఉంగరాలు, గడియారాలు, బిగుతుగా ఉండే నగలు లేదా దుస్తులను తీసివేయాలి.
పామును గుర్తించడం: వీలైతే పాము రంగు, ఆకారాన్ని గుర్తుంచుకోండి. ఇది డాక్టర్లు సరైన చికిత్స (యాంటీ వీనమ్) అందించడానికి సహాయపడుతుంది. అయితే పామును పట్టుకోవడానికి ప్రయత్నించి సమయం వృధా చేయకండి.
చేయకూడని పనులు:
కోయడం లేదా పీల్చడం: గాయం దగ్గర బ్లేడుతో కోయడం లేదా నోటితో విషాన్ని పీల్చడం వంటివి అస్సలు చేయకూడదు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు రావడమే కాకుండా కణజాలం దెబ్బతింటుంది.
బిగుతుగా కట్టు కట్టడం: రక్తం ఆగిపోవాలని కరిచిన చోటు పైన గుడ్డతో విపరీతమైన బిగుతుగా కట్టకూడదు. దీనివల్ల ఆ అవయవానికి రక్తప్రసరణ ఆగిపోయి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.
ఐస్ లేదా కెమికల్స్: గాయంపై ఐస్ పెట్టడం లేదా ఏవైనా ఆకులు, రసాయనాలు రాయకూడదు.
పాము కాటుకు మంత్రాలు, తాయెత్తులు లేదా గృహ వైద్యం విరుగుడు కాదు. కేవలం ఆసుపత్రిలో ఇచ్చే యాంటీ వీనమ్ ఇంజెక్షన్ మాత్రమే ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించాలి.













