విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పెరిగాయి : మంత్రి లోకేష్
2022-26 మధ్య 1,04,046 మంది విద్యార్థులకు అవకాశం కలిగింది
శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి: ప్రజాప్రభుత్వ పాలనలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో సభ్యులు కావలి గ్రీష్మ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పేరాబత్తుల రాజశేఖర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2022-23 నుంచి 2026-27 వరకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1,04,046 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. 12(1)(సి) సెక్షన్ కింద ప్రవేశాలు పారదర్శక ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా చేపట్టాం. 12(1)(సి) సెక్షన్ ను సమర్థంగా అమలుచేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాహక్కు చట్టం కింద విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. 2022-23 ఏడాదిలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో కేవలం 2,203 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదే 2024-25లో సుమారు 29వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. 2026-27 ఏడాదిలో 28,742 మంది విద్యార్థులకు విద్యాహక్కు చట్టం కింద అడ్మిషన్లు లభించాయి. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాహక్కు చట్టంపై సమాజంలో అవగాహన పెరిగిందని, దీనిపై పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.








