ఏపీలో హెచ్ సిఎల్
ఆంధ్రప్రదేశ్ సాప్ట్వేర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ కృతనిశ్చయంతో ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా హెచ్‌సీఎల్ కంపెనీని సందర్శించి సంస్థ చైర్మన్ శివ్నాడర్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం గా హెచ్‌సీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 45 రోజుల్లో కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులు మంజూరు చేశారు. కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన 17.86 ఎకరాల భూమి పత్రాలను నాడార్కు లోకేష్ అందజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా హెచ్‌సీఎల్ 3వేల ఉద్యోగాలు, హెచ్‌సీఎల్‌లో బీపీవో ద్వారా 2వేల ఉద్యోగాలు రానున్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వడం గురించి శివ్ నాడార్కు మంత్రి లోకేష్ వివరించారు. అనంతరం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ 45 రోజుల్లోనే హెచ్‌సీఎల్ కంపెనీకి భూమితో సహా అన్ని అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఐటి రంగం గడ్డు పరిస్థితిలో ఉన్న సమయంలో నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటుకు హెచ్‌సీఎల్ ముందుకురావడం సంతోషంగా ఉందన్నారు. జూన్ 2018 నాటికి హెచ్‌సీఎల్ మొదటి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. రూ.500 కోట్ల హెచ్‌సీఎల్ పెట్టుబడి పెట్టనుందని, హెచ్‌సీఎల్‌తో 5వేల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు.








