ఏపీకి అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస ప్రత్యేక సమావేశానికి భారతదేశం తరపున ఆంధ్రప్రదేశ్‌ను పంపించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర ఇంధన, మౌలికవసతులు, పెట్టుబడులు శాఖ ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 11.72 శాతం వృద్ధిరేటును సాధించడాన్ని పరిగణనలోకి తీసుకున్న నీతి ఆయోగ్ ఈ సమావేశం కోసం ఏపీ పేరును సూచించిందని పేర్కొంది. ఐరాస ప్రత్యేక సమావేశం వివరాలను నీతి ఆయోగ్ ఉన్నతాధికారి ఒకరు ఏపీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు ఫోన్ ద్వారా వివరించారని, రాష్ట్ర విభజన తర్వాత సాధించిన అభివృద్ధిని ఈ సమావేశంలో ప్రస్తావించాలని సూచించారని ఆ ప్రకటనలో వెల్లడించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రదర్శనకు న్యూయార్క్‌లో ఐరాస త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఏపీలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా-గోదావరి అనుసంధానానికి తీసుకున్న చర్యల తదితరాలను గుర్తిస్తూ నీతిఆయోగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.








