ఎవరినీ కాపాడాల్సిన అవసరం తనకు లేదు
ఎవరినీ కాపాడాల్సిన అవసరం తనకు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేశారు. సమస్యపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ నుంచి మొన్న ఎందుకు వెళ్లిపోయారో చెప్పాలని ప్రతిపక్షనేతను నిలదీశారు. పేపర్ లీక్‌పై ఉ.10:25కి డీఈవోకు సాక్షి రిపోర్టర్ సమాచారం ఇచ్చారని, వెంటనే డీఈవో పాఠశాలకు వెళ్లి దర్యాప్తు చేశారని చెప్పారు. లీకేజీ వ్యవహారంపై ఈ నెల 26న ప్రభుత్వానికి డీఈవో నివేదిక ఇచ్చారని తెలిపారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తప్పవని అన్నారు. ఇన్విజిలేటర్లకు నారాయణ స్కూల్ యాజమాన్యంతో సంబంధం లేదని, వివిధ ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులు నారాయణ స్కూల్లో ఇన్విజిలేటర్లుగా పనిచేశారని వివరణ ఇచ్చారు. పరీక్ష ప్రారంభమయ్యాక ప్రశ్నాపత్రాన్ని వాటర్‌బాయ్ వాట్సాప్‌లో బయటకు పంపారని, ఇన్విజిలేటర్, వాటర్ బాయ్ ఫోన్లను సీజ్ చేశామని పేర్కొన్నారు. టెన్త్ పేపర్ లీకేజీ కాలేదు. మాల్‌ప్రాక్టీస్ చేశారు. వైఎస్ హయాంలో వేల సంఖ్యలో మాల్ ప్రాక్టీసులు జరిగాయి. మా ప్రభుత్వం వచ్చాక మాల్‌ప్రాక్టీసులు బాగా తగ్గించాం. సమాచారం ఎప్పుడు వచ్చిందో సాక్షి రిపోర్టర్ వివరాలు చెబితే అందరిపైనా చర్యలు తీసుకుంటాం. తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకోవాలని సాక్షి రిపోర్టర్ చూస్తున్నారు. వైసీపీ కుట్ర పన్నినట్టు అనుమానంగా ఉంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.







