సమస్యలనుంచే అవకాశాలు సృష్టించుకోవాలి
రాష్ట్రాభివృద్ధికి రైతులు సహకరించినట్లు పారిశ్రామిక వేత్తలూ తోడ్పడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సూక్ష్య, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సమస్యల నుంచే అవకాశాలు సృష్టించుకోవాలన్నారు. సాంకేతికతతో పారిశ్రామికవేత్తలు స్వయంగా మార్కెటింగ్ చేసుకోవచ్చని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. పరిశ్రమల స్థాపనకు ఏకగవాక్ష విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రూ.100 కోట్ల కార్పస్‌తో ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో ఎంఎస్ఎంఈ భవన నిర్మాణానికి 15 ఎకరాల భూమిని కేటాయిస్తామని, పరిశ్రమల్లో తనిఖీలు అన్ని శాఖలతో ఒకేసారి జరిగేలా నూతన విధానాన్ని తీసుకురానున్నామని చెప్పారు. ఎవరి పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీ చేసేందుకు వీల్లేదని అన్నారు. పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరుకు ముందుకు రావాలని బ్యాంకులకు ముఖ్యమంత్రి సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో వంద ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.








