ఏప్రిల్ 2న ఏపీ మంత్రివర్గ విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏపీ అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9గంటల 25నిమిషాలకు ముహుర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమరావతి సచివాలయం ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్‌కు కేబినెట్లో చోటు దక్కనుంది. నారా లోకేశ్ కేబినెట్లోకి రావాలని ఎంతో కాలంగా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చంద్రబాబు ముహూర్తం ఖరారు చేశారు. లోకేశ్‌కు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ కేటాయించినట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినం రోజున విస్తరణ చేపట్టాలని చంద్రబాబు భావించారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు. కాగా ప్రస్తుత మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసన తప్పదనే సంకేతాలు అందుతున్నాయి.







