దసరాకు ఏపీ శాసనసభ భవనానికి శంకుస్థాపన
అమరావతిలో పరిపాలనా నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ రోజున శ్రీకారం చుడుతోంది. ఈ నెల 30న ఉదయం 8.26 గంటలకు శాసనసభ భవనం, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించిన పైల్ ఫౌండేషన్ పనులకు సీఆర్డీఏ శుక్రవారం టెండరు ప్రకటన జారీ చేసింది. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పిలిచారు. ఈ నెలాఖరున విడిగా ప్రకటన జారీ చేయనున్నారు. శాసనసభ భవన ఆకృతి స్థూలంగా ఖరారైంది. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ కోహినూర్ వజ్రాన్ని పోలిన విధంగా ఆకృతి రూపొందించింది. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడకు వస్తున్నారు. సీఆర్డీఏ అధికారులతో ప్రాథమిక చర్చలు, సమావేశాలు అనంతరం ఈ నెల 13న ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. అదే రోజున హైకోర్టు భవన తుది ఆకృతిని అందజేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులతో సమావేశమై డిజైన్ల గురించి వివరిస్తారు. హైకోర్టు ఆకృతిని స్థూపాన్ని పోలిన విధంగా రూపొందిస్తున్నారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ (హెచ్ఓడీ) భవనాల ప్రాథమిక ఆకృతుల్ని కూడా అదే రోజు నార్మన్ ఫోస్టర్ సంస్థ అందజేయనుంది.








