ఇ-లెర్నింగ్ గేమింగ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్
ఇ-గేమింగ్ విధానాల ద్వారా చిన్నారులకు సులభంగా విద్యను బోధించేలా వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దీనిపై యునెస్కో తదితర సంస్థల సహకారం తీసుకోవాలని విద్యాశాఖకు సూచించారు. రాష్ట్రాన్ని ఇ-లెర్నింగ్ గేమింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని, యునెస్కో సహకారం అందించడానికి ముందుకు రావడం శుభసూచకమని అన్నారు. శనివారం మధ్యాహ్నం ‘యునెస్కో-ఎంజీఐఈపీ’ ప్రతినిధులు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు విశాఖలో నిర్వహించనున్న ‘ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ఫర్ హ్యుమానిటీ (టెక్-2017)’ సదస్సుపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు.
ఏపీ ప్రభుత్వంతో కలిసి యునెస్కోకు అనుబంధంగా వున్న మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (ఎంజీఐజీపీ) ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యం 4.7’ సాధన కోసం విద్యా సాంకేతికత, డిజిటల్ పద్ధతుల ద్వారా శాంతియుత-సుస్థిర సమాజ స్థాపన ధ్యేయంగా టెక్-2017 జరగనుంది.
పలు దేశాలు, రాష్ట్రాల నుంచి విద్య, సమాచార సాంకేతిక, యువజన శాఖలకు చెందిన మంత్రులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, విద్యాసాంకేతిక నిపుణులు, అధ్యాపకులు, ఎడ్యుకేషన్ సైకాలజిస్టులు, పరిశోధకులు, న్యూరో సైంటిస్టులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సదస్సుకు హాజరై ప్రసంగిస్తారని చెప్పారు. విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయని తెలిపారు. టెక్-2017కు కేంద్ర మానవ వనరుల శాఖ కూడా సహకారం అందిస్తోంది.
ముఖ్యమంత్రితో సమావేశమైన వారిలో యునెస్కో ఎంజీఐఈపీ ప్రతినిధి అనంత దురైయప్ప, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి పాల్గొన్నారు.








