కర్నూలు సోలార్ పార్కుపై అమెరికా సంస్థ ఆసక్తి
సంప్రదాయేతర ఇంధన వనరులు ఉత్పత్తి, వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వ ఘనతను అంతర్జాతీయ కంపెనీలు గుర్తించాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు అన్నారు. ప్రపంచంలోనే పెద్దదైన కర్నూలులోని వెయ్యి మెగావాట్ల సోలార్ పార్కును పరిలీలించడం కోసం వచ్చిన కాలిఫోర్నియాకు చెందిన నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్ఆర్డీసీ) బృందం ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోలార్, పవన్ విద్యుత్తు రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై ఎన్ఆర్డీసీ డైరెక్టర్ జైస్వాల్ హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంప్రదాయేతర ఇంధన వనరుల విజయాలను మంత్రి పరిచయం చేశారు. మూడేళ్లలోనే ఏపీని సోలార్ చాంపియన్గా సీఎం మలచారని కొనియాడారు. కర్నూలులోని 1,000 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో 1,500 మెగావాట్లు, కడప జిల్లాలో 1,000 మెగావాట్లు, అనంతపురం-2లో 500 మెగావాట్లు సోలార్ పార్కులను నిర్మిస్తున్నామన్నారు.








