అసెంబ్లీ కోహినూర్ వజ్రం… హైకోర్టుకు బౌద్ధ స్థూపాకృతి… చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరాతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవనాన్ని కోహినూర్ వజ్రం ఆకృతిలో నిర్మించాలని నిర్ణయించారు. హైకోర్టు భవనాన్ని బౌద్ధ స్థూపాన్ని పోలిన ఆకృతిలో నిర్మిస్తారు. రాజధాని 1365 ఎకరాల్లో నిర్మించే పరిపాలన, న్యాయ నగరాల తుది బృహత్ ప్రణాళిక, శాసనసభ, హైకోర్టు భవనాల తుది ఆకృతులను లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందజేసింది. ఆ సంస్థ ప్రతినిధులు విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్థూపాకృతిని హైకోర్టుకి, వజ్రం ఆకృతిని శాసనసభకు మర్చాలని సూచించారు. ఆ సంస్థ రూపొందించిన వజ్రం ఆకృతిని మార్చి కోహినూర్ వజ్రాన్ని పోలిన విధంగా రూపొందించాలని చెప్పారు. కోహినూర్ వజ్రం ఈ గడ్డపైనే దొరికింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో విలువైన వజ్రాన్ని పోగొట్లుకున్నారు. ఇప్పుడు దాన్ని అసెంబ్లీ భవనం రూపంలో చూసుకుని సంతోషపడతారు అని చంద్రబాబు పేర్కొన్నారు.








