అక్టోబరులో అమరావతి ప్రకటన
మహిళా సాధికారతకు సంబంధించి అమరావతి ప్రకటనను అక్టోబరులో విడుదల చేయాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయించారు. అసెంబ్లీ మీటింగ్ హాల్లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో అమరావతి ప్రకటన విడుదలకు అక్టోబరు 10-14 మధ్య ఏదో ఒక రోజును ఖరారు చేయాలని నిర్ణయించారు. విజయవాడ లోని ఏ-వన్ కన్వన్షన్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని, రాజకీయ వాసనలు లేకుండా చూడాలని సృష్టం చేశారు. వారంలోగా అమరావతి ప్రకటన పుస్తకం పూర్తవుతుందని అన్నారు. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు నలుగురు ముఖ్య అతిథులు ప్రసంగించే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, అపోలో హాస్పటల్స్ జీఎండీ సంగీతా రెడ్డి, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చార్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. విద్య, రాజకీయ, పారిశ్రామిక రంగాలు, స్వచ్ఛంద సంస్థలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, డ్వాక్రా గ్రూపు మహిళలు సహా ఇతర రంగాల ముఖ్యులనూ ఆహ్వానిస్తారు. కార్యక్రమ నిర్వహణ, ఆహ్వాన బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు.








