పంద్రాగస్టు వేడుకలకు తిరుపతి ముస్తాబు
దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా, సోమవారం సాయంత్రమే చంద్రబాబు నాయుడు తిరుపతికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా అవిలాలలో కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాలనీని ప్రారంభిస్తారు. మంగళవారం ఉదయం 8:50 గంటలకు పద్మావతి అతిథి గృమం నుంచి ఎస్వీయూ స్టేడియానికి చేరుకుని స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొంటారు. ఇదిలావుంటే, తిరుపతిలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ పథకాలకు సంబంధించిన 12 శకటాలను ప్రదర్శించారు. ఇరిగేషన్, అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, టూరిజం అండ్ కల్చరల్, ఎస్సీ కార్పొరేషన్, సీఆర్డీఏ, టీటీడీ, వైద్య ఆరోగ్యం, స్వచ్ఛ భారత్ శకటాలు ప్రదర్శనలో ఉంటాయి.








