నవ్యాంధ్రను అగ్రస్థానంలో నిలబెడదాం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంట్ను తరుణంలో దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో తారకరామ మైదానంలో నిర్వహించిన 71వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భారతదేశానికి ఒకే పటంపైకి తీసుకొచ్చిన ఘనత వల్లభాయ్ పటేల్ అని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడన్నారు. ఆయన్ని తలుచుకుంటే ఇప్పటికే ఆవేశం వస్తోందని చెప్పారు. జాతీయ పతాకానికి నాంది పలికిన పింగళి వెంకయ్య ఇక్కడివారేనని పేర్కొన్నారు. నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ విధానం లేదన్నారు. ఈ సారి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ వేడుకలు నిర్వహించడం గర్వకారణంగా అనిపిస్తోందని అన్నారు. తిరుపతి నాకు జన్మనిస్తే వెంకటేశ్వరస్వామి పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. అలిపిరిలో జరిగిన దాడి నుంచి ఆయనే నన్ను కాపాడారన్నారు. ప్రజలకు మరింత కాలం సేవ చేసే అదృష్టాన్ని ఆయన నాకు ప్రసాదించాడని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో సామాన్యులు సైతం అత్యున్నత పదవులు అధిరోహించవచ్చుని చెప్పారు. ఎన్టీఆర్, మోదీ లాంటి వారే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మోదీ ఇప్పుడు ప్రపంచం మెచ్చే ప్రధాని అయ్యారని కితాబిచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో మానవ వనరులకు కొదవ లేదని, నవ్యాంధ్రప్రదేశ్‌ను దేశంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.








