గన్నవరం నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు
కృష్ణా జిల్లా గన్నవరంలోగల విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూమిసేకరణకూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. కాగా గన్నవరం విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అవసరమైన ఇమిగ్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇమిగ్రేషన్ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను అధిగమించాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఇటీవల కేంద్ర హోంశాఖ సెక్రటరీ రాజీవ్‌ను ఆదేశించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఇందుకు తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు ఉప రాష్ట్రపతికి హోం శాఖ నివేదించింది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర హోం శాఖ అధికారులు అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇమిగ్రేషన్ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంబంధిత అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే అవసరం ఇక ఉండదని అంటున్నారు.













