బైడన్ ప్రత్యర్థి..?
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లిక్ పార్టీలో పోరు రసవత్తరంగా మారుతోంది. ఓవైపు అత్యధిక మద్దతుతో ట్రంప్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రెండు, మూడు స్థానాల్లో డిశాంటిస్, వివేక్ రామస్వామి కొనసాగుతున్నారు. ఎలాంటి డిబేట్ జరగకముందే ట్రంప్ కు.. అనుకూలంగా అత్యధికశాతం ఓటర్లు ఉండడం ఆయన ఆధిపత్యాన్ని సూచిస్తోంది. అయితే మూడోస్థానంలో ఉన్న వివేక్ రామస్వామి క్రమంగా పుంజుకుంటున్నారు. దీంతో ట్రంప్, డిశాంటిస్ లకు మద్దతు తగ్గుతుండగా.. రామస్వామికి మద్దతు పెరుగుతోంది. ఇక తర్వాతి స్థానాల్లో పెన్స్, స్కాట్, హేలీ కొనసాగుతున్నారు.
రామస్వామి ప్రసంగాలు అమెరికా ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ ఆయన మాటలకు ఫిదా అయ్యారు. ఇక తొలి చర్చలో రామస్వామి ఎలా మాట్లాడతారనేది చూడాలి. ఫాక్స్ న్యూస్ సర్వేలో రామస్వామికి మద్దతు పెరిగినట్లు తేలింది. గత జూన్‌తో పోలిస్తే ఆయనకు మద్దతిచ్చే పార్టీ సభ్యుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ 53శాతం మంది మద్దతు కూడగట్టుకోగా డిశాంటిస్‌కు 16శాతం మంది మద్దతిచ్చారు. వివేక్ రామస్వామి 11శాతం మంది మద్దతుతో మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు మద్దతిచ్చేవారు అంతకంతకూ పెరుగుతున్నారు. సీబీఎస్ పోల్‌లో 62 శాతం మంది ట్రంప్‌వైపు ఉన్నట్లు తేలింది. 16శాతంతో డిశాంటిస్ రెండో స్థానంలో, 7శాతంతో వివేక్ మూడో స్థానంలో ఉన్నారు. ఓ సర్వేలో ఏకంగా డిశాంటిస్తో సమానంగా వివేక్‌కు పార్టీ సభ్యుల మద్దతు లభించిందని అంటున్నారు.
ఓవైపు వయోభారంతో బైడన్ ఇబ్బంది పడుతున్నా.. మరోసారి బరిలో నిలుస్తున్నారు. బైడన్-కమలా హ్యారిస్ జోడీ మళ్లీ తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఈసారి వారిని ఓడించడం తమకు సాధ్యమవుతుందని రిపబ్లికన్లు విశ్వసిస్తున్నారు. తాను ఎన్నికల బరిలోగెలుపు ఖాయమంటున్నారు ట్రంప్. దానికి తోడు తనను కేసుల్లో ఇరికించి, అణగదొక్కాలని చూస్తున్నారని.. అయితే కేసులకు భయపడనంటున్నారు. ఎన్నికేసులు తనపై పెడితే, అంతగా తనకు ప్రచారం లభిస్తుందని ట్రంప్ చెబుతున్నారు. అంతే కాదు.. సాదారణంగా అమెరికా అధ్యక్ష బరిలో దిగేనేతలు .. డిబేట్లకు హాజరవుతారు. తాను డిబేట్లకు సైతం హాజరయ్యేది లేదంటున్నారు.
అయితే ట్రంప్ కు న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ అతివాద వైఖరితో రిపబ్లికన్లతో పాటు అమెరికా సమాజంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో తర్వాతి ఛాన్స్ గా రామస్వామి, డిశాంటిస్ లలో ఒకరికి అవకాశం దక్కేలా ఉంది. వరుస డిబేట్లతో తమ సత్తా చాటుకోగలిగి, అమెరికన్లను ఆకట్టుకోగలిగితే భారతీయ మూలాలున్న అమెరికన్ గా రామస్వామిని .. అగ్రరాజ్యపీఠంపై చూసే అవకాశం దక్కుతుంది.






