TVK – BJP: విజయ్‌కి డిప్యూటీ సీఎం ఆఫర్ చేసిన బీజేపీ.. పొత్తు కుదిరేనా..?
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే, ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించిన తర్వాత అక్కడి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా విజయ్‌కు బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందనే వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. బీజేపీ, టీవీకే మధ్య పొత్తు కుదిరిందనే ప్రచారం ఊపందుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, విజయ్ పార్టీకి బీజేపీ దాదాపు 80 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు సిద్ధపడిందని, అంతేకాకుండా అధికారంలోకి వస్తే విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆఫర్ చేసిందని తెలుస్తోంది. అయితే, విజయ్ మాత్రం నేరుగా ముఖ్యమంత్రి పీఠంపైనే కన్నేశారని, అందుకే ఈ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్ తన పార్టీ తొలి బహిరంగ సభలోనే తన రాజకీయ శత్రువులెవరో స్పష్టం చేశారు. అటు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కుటుంబ పాలనను, ఇటు భారతీయ జనతా పార్టీ (BJP) విభజన రాజకీయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “పొత్తులకు తావు లేదు, ఒంటరిగానే పోరాటం” అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజుల కిందట కూడా ఎన్డీయేలో చేరేది లేదని తేల్చేశారు. ద్రవిడ సిద్ధాంతాన్ని, జాతీయవాదాన్ని మేళవించి సరికొత్త తమిళ జాతీయవాదం అనే నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు.
మరి ఇలాంటి తరుణంలో బీజేపీతో పొత్తు వార్తలు రావడం ఆసక్తి రేపుతోందు. డిఎంకేను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు. ఇందుకోసం బీజేపీ తనతో కలిసొచ్చే శక్తులను కలుపుకోవాలని చూస్తోంది. విజయ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి లేదా ఆయనను ఒక వర్గానికి అనుకూలంగా చిత్రీకరించడానికి ప్రత్యర్థి పార్టీలు ఇటువంటి వార్తలను ప్రచారంలోకి తెచ్చే అవకాశం కూడా ఉంది. తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసినా ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుతం అన్నాడీఎంకే బలహీనపడటం, విజయ్‌కు యువతలో ఉన్న విపరీతమైన క్రేజ్ బీజేపీకి కలిసివచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. విజయ్ వంటి బలమైన నాయకుడు తోడైతే, డిఎంకే కోటను బద్దలు కొట్టవచ్చని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆయనకు గౌరవప్రదమైన సీట్లు, డిప్యూటీ సీఎం వంటి కీలక పదవుల ఎర వేస్తున్నట్లు సమాచారం.
విజయ్ ఒకవేళ బీజేపీతో చేతులు కలిపితే అది ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బలమైన జాతీయ పార్టీ అండ ఉండటం వల్ల ఆర్థిక, వ్యవస్థాగత బలం పెరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒకే గొడుగు కిందకు తేవచ్చు. విజయ్ ఇప్పటివరకు చెబుతున్న సిద్ధాంతాలకు ఇది విరుద్ధం. ముఖ్యంగా తమిళనాడులో ‘హిందీ వ్యతిరేకత’, ‘ద్రవిడ మూలాలు’ బలంగా ఉన్న నేపథ్యంలో, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆయనను ‘బీజేపీ బి-టీమ్’గా ముద్ర వేసే ప్రమాదం ఉంది. ఇది ఆయన ప్రాథమిక ఓటు బ్యాంకును దెబ్బతీయవచ్చు.
విజయ్ పార్టీ టీవీకే ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ఒకవైపు అధికార డిఎంకే, మరోవైపు అన్నాడీఎంకే మధ్య మూడో శక్తిగా ఎదగాలంటే బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు విజయ్ లేదా బీజేపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తలు కేవలం ఊహాగానాలేనా లేక తెర వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం అమలవుతోందా అనేది ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విజయ్ తన ఇమేజ్ను కాపాడుకుంటూ ఒంటరి పోరుకు వెళ్తారా? లేక అధికారమే పరమావధిగా పొత్తుల బాట పడతారా? అన్నది ఇప్పుడు తమిళనాట మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, విజయ్ రాజకీయ ప్రస్థానం తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు.








