మహా స్కెచ్?
కేంద్ర మంత్రివర్గంలో శరద్ పవార్ చేరుతున్నారంటూ వచ్చిన వార్తలు.. విపక్ష కూటమిలో ప్రకంపనలు రేపాయి. శరద్‌తో అజిత్ పవార్ భేటీ సందర్భంగా ఈప్రతిపాదన వచ్చిందటూ.. ప్రతిగా విపక్ష కూటమికి శరద్ దూరంగా ఉండాలంటూ అజిత్ సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ఒట్టి అబద్దమన్నారు శరద్ పవార్. కేంద్రమంత్రి వర్గంలో చేరాలంటూ ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు.
బీజేపీలో చేరాలంటూ కొందరు తనను సంప్రదించినట్లు శరద్ పవార్ అంగీకరించారు. అయితే తన పార్టీ బీజేపీతో కలిసి పనిచేసేది లేదన్నారు. ఎన్సీపీ రాజకీయ విధానానికి ఇది విరుద్ధమని చెప్పారు. పార్టీలో తాను సీనియర్ అన్న శరద్ పవార్, కేంద్ర మంత్రివర్గంలో చేరాలన్న ప్రతిపాదన ఎవరూ చేయలేదని స్పష్టం చేశారు.
ఇటీవల వరుసగా శరద్‌పవార్‌తో అజిత్ పవార్ రహస్య సమావేశాలు.. మహావికాస్ అఘాడీలో కలకలం రేపుతున్నాయి. ఓకుటుంబ పెద్దగా అజిత్‌ను కలిశామని శరద్ చెబుతున్నా.. ఎందుకో విపక్ష కూటమిలో మాత్రం అనుమానాలు ఆగడం లేదు. ఇలాంటి సమయంలో వరుసగా ఎందుకు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని … కొందరు నేతలు డైరెక్టుగానే ప్రశ్నిస్తున్నారు. అయితే.. శరద్ పవార్.. పోరాటపటిమ గల నాయకుడంటూ వెనకేసుకొచ్చారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.
కాగా, ఎన్సీపీ గుర్తింపు, ఆ పార్టీ గుర్తుపై వివరణ కోసం శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మూడు వారాలు గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 8లోగా తన నోటీస్‌కు సమాధానం ఇవ్వాలని రెండు వర్గాలకు ఆదేశించింది. ఆగస్ట్ 17లోగా సమాధానం ఇవ్వాలంటూ జూలై 27న ఇరువర్గాలకు ఈసీ లేఖలు రాసింది. తాజాగా ఆ గడువును సెప్టెంబర్ 8 వరకు పొడిగించింది. ఎన్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల అఫిడవిట్లతోపాటు అజిత్ పవార్‌ను ఎన్సీపీ చీఫ్‌గా ఎన్నుకుంటూ రెబల్ వర్గం చేసిన తీర్మానం కూడా ఈసీ వద్దకు చేరాయి. వీటిని పరిశీలిస్తున్న ఈసీ, ఇరు వర్గాల వివరణ కోరింది.













