నావల్నీ మృతిఘటనపై పాశ్చాత్య ప్రపంచం ఆగ్రహం..
రష్యన్ల హక్కుల కోసం పోరాడిన విపక్షనేత అలెక్సీ నావల్నీ మృతి ఆదేశ పౌరులను విషాదంలోకి నెట్టేసింది. తమ అభిమాననేతకు నివాళులు అర్పించేందుకు ప్రజలు .. స్మారక చిహ్నాల దగ్గరకు పోటెత్తుతున్నారు. అయితే వారిని రష్యా సైన్యం అడ్డుకుంటోంది. ఇప్పటికే పలునగరాల్లో వందమందికిపైగా ప్రజల్ని అరెస్ట్ చేశారు అధికారులు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. ఆయన మరణం తనను ఆశ్చర్యపర్చలేదు కానీ.. ఆ వార్త విన్న తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని అన్నారు.
పుతిన్ ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, హింస, అవినీతికి వ్యతిరేకంగా నావల్నీ ధైర్యంగా గళం వినిపించారు. ఆయన మృతికి పుతినే బాధ్యుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని వైట్‌హౌస్ ప్రతినిధులు తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా నావల్నీ మృతిపై స్పందించారు.ఇది తీవ్ర విషాదకర ఘటన. రష్యా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వారిని అణచివేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ఈ ఘటన తెలియజేస్తోంది. పుతిన్ అంటే ఏమిటో ప్రపంచానికి ఇది గుర్తుచేస్తుంది అని అన్నారు.
నావల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యులియా నావల్నియా అనుమానం వ్యక్తం చేశారు. అవే కనుక నిజమైతే.. పుతిన్, ఆయన అనుచరులు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. పుతిన్, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నమ్మలేం. వారు ఎప్పుడూ అవాస్తవాలే చెప్తారు. కానీ వారు చెప్పింది నిజమైతే నా దేశానికి, నా కుటుంబానికి చేసిన అన్యాయానికి.. పుతిన్, ఆయన పరివారం బాధ్యత వహించాలి. ఆ రోజు త్వరలోనే వస్తుంది అని ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. ప్రస్తుతం రష్యాలో ఉన్న భయంకరమైన పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని మ్యూనిచ్ సెక్యురిటీ కాన్ఫరెన్స్ వేదికగా పిలుపునిచ్చారు.













