Congress: ట్రంప్ కు మోడీ సాగిలపడ్డారన్న విపక్షాలు.. ఒప్పందమే కాదని ఫైర్..!
ఇండియా-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రజలకు ఎన్డీయే ప్రభుత్వం ‘ద్రోహం’ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అసలిది ఒప్పందమే కాదన్నారు మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం(CHIDAMBARAM). సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో, ”భారత్-అమెరికా ఉమ్మడి ప్రకటన చూస్తుంటే ఇరు దేశాల మధ్య ఇంకా ఎటువంటి అధికారిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరలేదని అర్థమవుతోంది. ఇది కేవలం ఒక మధ్యంతర ఒప్పంద ముసాయిదా మాత్రమే. ఈ ఒప్పందం పూర్తిగా అమెరికా వైపే మొగ్గు చూపుతోంది. ఇందులో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు..
భారత ఆర్థిక వ్యవస్థను, రైతులను, మన ప్రయోజనాలను ఒక పళ్లెంలో పెట్టి ట్రంప్‌కు నరేంద్ర మోడీ అప్పగించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా(PAVAN KHERA) విమర్శించారు.”దశాబ్దాలుగా అమెరికాతో భారత్‌కు వాణిజ్య మిగులు ఉండేది. ఇది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. కానీ ఇప్పుడు మోడీ తలొగ్గడం వల్ల అమెరికా వస్తువులకు భారత్ ఒక ‘డంపింగ్ గ్రౌండ్’గా మారింది” అని ఆయన ఆరోపించారు.
”అమెరికా గతంలో టారిఫ్‌ను 3 శాతం నుంచి 50 శాతానికి పెంచి, ఇప్పుడు దానిని 18 శాతానికి తగ్గించగానే మోడీ సంతోషిస్తున్నారు. రష్యా నుంచి చమురును భారత్ కొంటుందో లేదో అమెరికా నిశితంగా గమనిస్తుంది. ఒకవేళ మనం చమురు కొంటే, మనపై మళ్లీ టారిఫ్‌లు వేస్తామని బెదిరిస్తోంది” అని పవన్ ఖేరా అన్నారు.
”ప్రధాని మోడీ భారత ప్రయోజనాలకు విరుద్ధంగా ట్రంప్ చెప్పినట్లు ఆడుతూ ఈ ఒప్పందం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ట్రంప్ ఏవైతే చెప్పారో, ఈ ఉమ్మడి ప్రకటనలో అవే ఉన్నాయి. అప్పుడు మౌనంగా ఉన్న మోడీ ప్రభుత్వం, ఇప్పుడు ట్రంప్ మాటలనే ఒప్పందంగా చెప్తోంది” అని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనేత్(SUPRIYA) విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం సంతకం చేసిన భారత్-అమెరికా ఒప్పందం అమెరికాకు అనుకూలంగా ఉందని, ఇది దేశీయ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని డీఎంకే ఎంపీ కనిమొళి(KANIMOLI) ఆరోపించారు.. మనదేశం ఎగుమతులపై 18శాతం పన్ను ఉండగా.. అమెరికా దిగుమతులపై సున్నాశాతం అనడం అన్యాయమన్నారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులను పారవేస్తామని హెచ్చరించారు.













