దైవం మానవ రూపేణా..! రైల్లో డెలివరీ చేసిన డాక్టర్ స్వాతి రెడ్డి!!
ఏదైనా అపాయంలో ఉన్నప్పుడు ఊహించని విధంగా మనల్ని ఎవరైనా ఆ అపాయం నుంచి గట్టెక్కించినట్లయితే అలాంటి వాళ్లను దేవుడిగా భావిస్తుంటాం. దేవుడే వచ్చి కాపాడాడని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. కదులుతున్న రైల్లో గర్భిణికి కాన్పు చేసిందో డాక్టర్. ఇప్పుడీ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ లో శ్రీకాకుళంకు చెందిన గర్భిణి సత్యవతి, ఆమె భర్త ప్రయాణిస్తున్నారు. వాళ్లు విజయవాడలో బీ6 బెర్తులో ఎక్కారు. సత్యవతికి ఇప్పుడు ఎనిమిదో నెల. డెలివరీకి ఇంకా నాలుగు వారాల సమయం ఉంది. అందుకే వాళ్లు పుట్టింటికి బయలుదేరారు. విజయవాడ నుంచి బయలుదేరిన కాసేపటికి అంటే తెల్లవారుజామున సత్యవతికి నొప్పులు మొదలయ్యాయి. రాజమండ్రి – సామర్లకోట మధ్యలో ఈ సంఘటన జరిగింది. భర్తకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరైనా మహిళల సాయం తీసుకోవాలని ఆయన బెర్తులో నిద్రిస్తున్న మహిళలకోసం వెతికారు. వెంటనే పక్కనే ఉన్న ఓ బెర్తులో మహిళ నిద్రిస్తుండడంతో వెళ్లి నిద్రలేపి సాయం చేయాలని కోరారు.
సత్యవతి భర్త నిద్రలేపిన మహిళ పేరు స్వాతిరెడ్డి. ఆమె గీతం మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్. సత్యవతి భర్తకు ఆ విషయం తెలియదు. ఆయన నిద్రలేపగానే వెంటనే స్పందించిన స్వాతిరెడ్డి.. బెడ్ షీట్ అడ్డంపెట్టి 15 నిమిషాల్లోనే డెలివరీ చేశారు. సత్యవతి దగ్గర ఎలాంటి పరికరాలూ లేవు. అయినా ఆ సమయంలో ఆమెకు వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్ లాంటివి గుర్తుకు రాలేదు. ఆపదలో ఉన్న గర్భిణికి సాయం చేయాలనుకున్నారు. వెంటనే తన అనుభవాన్నంతా రంగరించి డెలివరీ చేశారు. స్వాతి రెడ్డి వయసు 23 ఏళ్లు. స్వాతిరెడ్డి సొంతూరు నరసరావుపేట.
ఇంతలోనే గర్భిణికి నొప్పులు వచ్చిన విషయాన్ని టికెట్ కలెక్టర్ చెప్పడంతో ఆయన అనకాపల్లిలో రైలును ఆపారు. వాస్తవానికి అనకాపల్లిలో దురంతో ఎక్స్ ప్రెస్ కు హాల్ట్ లేదు. అయినా ఎమర్జెన్సీ కావడంతో ట్రెయిన్ ఆపి సత్యవతిని 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. రైలులో డెలివరీ చేసిన స్వాతిరెడ్డి కూడా వారితో పాటే అనకాపల్లిలో దిగి ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో తగిన ట్రీట్ మెంట్ అందించారు. స్వాతిరెడ్డి చేసిన సాయం, సాహసంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో స్వాతి రెడ్డి ఇప్పుడు వైరల్ గా మారారు. గీతం యూనివర్సిటీ యాజమాన్యం కూడా స్వాతిరెడ్డికి అభినందనలు తెలియజేసింది.













