Delhi: ట్రేడ్ డీల్ సాగుకు నష్టమా…? లాభమా..?
అమెరికాతో ట్రేడ్ డీల్ తో అద్భుతం, అమోఘమంటోంది కేంద్రం. అయితే దీనిపై అధికశాతం మంది మాత్రం నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డీల్‌లో మెజారిటీ ప్రయోజనాలు అమెరికాకే దక్కుతున్నాయని, భారత్‌కు లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీనికి గానూ కొన్ని ముక్య కారణాలను విశ్లేషిస్తున్నారు.
ప్రధానమైంది 18 శాతం టారిఫ్ లు…
తాజా డీల్ ప్రకారం.. భారత్‌పై ప్రతీకార సుంకాలను 50 శాతం (రష్యా చమురు కొనుగోలుకు విధించిన 25 శాతం అదనపు సుంకంతో కలిపి) నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. అయితే, అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలను సున్నాకు తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే, అమెరికా ఉత్పత్తులపై మనం ఎలాంటి సుంకాలు విధించకపోయినా.. అగ్రరాజ్యం భారత ఉత్పత్తులపై 18 శాతం అదనపు సుంకాలను కొనసాగిస్తుందని అర్థం. ఇప్పుడు 18 శాతం సుంకాలు విధిస్తున్న ఉత్పత్తులపై ఏడాది కిందట అంటే ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందు టారిఫ్‌లు జీరోగా ఉండేవి. గతంతో పోలిస్తే, టారిఫ్‌లు 18 శాతం పెరిగాయని అర్థం. ఇక, ఫార్మా, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలపై అమెరికా సుంకాలను ఎత్తేసిందని కేంద్రం గొప్పగా చెప్పుకొచ్చింది. అయితే, ఏడాది కిందట కూడా వీటి మీద ఎలాంటి సుంకాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
రూపాయి మరింత పతనం ఖాయమా..?
డీల్ ప్రకారం.. 500 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.45 లక్షల కోట్లు) పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, మెటల్స్, ఇతర ఉత్పత్తులతో పాటు వీటికి అదనంగా మరిన్ని అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించిందని తెలుస్తోంది. అ అలా భారత్ చేసుకొన్న దిగుమతులకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలి. ఇదే జరిగితే విదేశీ మారకపు నిల్వలు దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే.. డాలర్‌తో పోలిస్తే ఇప్పటికే చారిత్రక కనిష్ఠాలకు పడిపోతున్న రూపాయి విలువ అధః పాతాళానికి పడిపోవడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాగు రంగం నిర్వీర్యమేనా…?
తాజా ట్రేడ్ డీల్‌తో మన రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్రం చెబుతోంది. అయితే, శ్వేత సౌధం విడుదల చేసిన డీల్ ప్రకటనలో అమెరికాకు చెందిన ఆహార, వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి సుంకాలు లేకుండా అనుమతించడానికి మోడీ ప్రభుత్వం ఒప్పుకొన్నట్టు స్పష్టంగా ఉన్నది. అంతేకాదు, పొడి ధాన్యం (డీడీజీ), పశువుల దాణాకు వినియోగించే ఎర్ర జొన్నలు, ట్రీ నట్స్, ప్రాసెస్ చేసిన తాజా పండ్లు, సోయాబీన్ ఆయిల్ వంటి వ్యవసాయ, ఆహార ఉత్పత్తులను జీరో టారిఫ్ లేదా నామమాత్రపు సుంకాలతో దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించినట్టు అమెరికా పేర్కొంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను అనుమతిస్తే, దేశీయ ఉత్పత్తుల సంగతేమిటని నిలదీస్తున్నారు.
ట్రంప్ మాటే ఫైనలా…?
రష్యా చమురును కొనుగోలు చేయడాన్ని నిలిపివేయడమే కాదు, వెనెజువెలా నుంచి మరింత చమురును కొనేందుకు భారత్ ముందుకు వచ్చిందని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ అందుకు అనుగుణంగా టారిఫ్‌లను సవరిస్తామని కూడా పరోక్షంగా హెచ్చరించారు. డీల్‌లోనూ పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే, భారత దేశ సార్వభౌమాధికారం, ఇంధన భద్రతకు సంబంధించిన సార్వభౌమాధికారం అమెరికాకు మోడీ తాకట్టు పెట్టారా? అంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశ అంతర్గత నిర్ణయాల మీద అమెరికా పర్యవేక్షణ ఏమిటని నిలదీస్తున్నారు.













