Trump: భారత్ -అమెరికా గ్రేట్ బిజినెస్ డీల్.. ట్రంప్, మోడీ హర్షం..!
భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఫలితంగా ప్రతీకార సుంకాలను 25 నుంచి 18శాతానికి తగ్గిస్తున్నామని నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు.. తమ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను జీరో చేయడానికి భారత్ అంగీకరించిందన్నారు. దీనికి తోడు తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50 శాతం(ఇందులో రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25 శాతం అదనపు సుంకం ఉంది) సుంకాలు 18 శాతానికి తగ్గుతాయి.
ప్రధాని మోడీతో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నామన్నారు అమెరికా అధ్యక్షుడుట్రంప్. నాకున్న గొప్ప స్నేహితుల్లో ఆయన ఒకరు. భారత్‌కు ఆయన శక్తిమంతమైన, గౌరవప్రదమైన నాయకుడు. మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాణిజ్యం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా, వెనెజువెలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించాం. ఇది ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకగలదని అనుకుంటున్నా. మోడీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తిమేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నా. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారు. 500 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు ఆ దేశం సిద్ధంగా ఉంది. వారితో మాకున్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ముందుకు సాగనుంది. మోడీ, నేను అన్ని విషయాలను చక్కబెడుతున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటనపై మోడీ స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచీ 18 శాతం అమెరికా సుంకమే అమలు కానుందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ‘అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌నకు చాలా చాలా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పని చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రపంచ శాంతికి, సుస్థిరతకు, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకం. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుంది. రెండు దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు ఆయనతో సన్నిహితంగా కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మోడీ వివరించారు.






