IND-USA: ఇండో-అమెరికా మధ్యంతర ట్రేడ్ డీల్ ఫ్రేమ్ వర్క్..
ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండో-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US Interim Trade Agreement) ఎట్టకేలకు ఖరారైంది. దీనికి సంబంధించి ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇరుదేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్యఒప్పందం కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటుచేసినట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.
తాజా మధ్యంతర ఒప్పందాన్ని చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ . ఇది భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ తెరుస్తుందని.. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఎగుమతులు పెరగడంతో దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, గృహాలంకరణ, చేతివృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాలు వంటి కీలక రంగాలకు లాభదాయకమన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా తెలిపింది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. తమ దేశం నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది.
వీటిపై ఎలాంటి రాయితీలు లేవు..
తాజా ఒప్పందంలో భాగంగా మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, నూనెగింజలు, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకుతో పాటు కొన్నిరకాల కూరగాయలు, మాంసం వంటి వ్యవసాయ, పాల ఉత్పత్తులపై సుంకాల విషయంలో అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని గోయల్ తెలిపారు. అన్ని వాణిజ్య చర్చల్లో రైతుల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
అదనపు సుంకాల తొలగింపు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో గతేడాది భారత వస్తువులపై 25 శాతం అదనపు సుంకాలు విధించింది అమెరికా.. తాజా ఒప్పందం నేపథ్యంలో వాటిని తొలగిస్తున్నట్లు యూఎస్ పేర్కొంది. ఈమేరకు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారని వైట్‌హౌస్ పేర్కొంది. ఇది ఫిబ్రవరి 7 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే రానున్న 10 ఏళ్లలో రక్షణ సహకారం విస్తరించుకునేందుకు ఇరుదేశాలు ఓ ఫ్రేమ్‌వర్క్‌కు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.













