Central Govt: పాడి, వ్యవసాయరంగంపై యూఎస్-ఇండియా ఒప్పందం ఎఫెక్ట్ ..?
అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భారత వ్యవసాయరంగం, రైతుల ప్రయోజనాలను కాపాడామని కేంద్రం చెబుతోంది. ఇది చారిత్రాత్మక ఒప్పందమని వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ ప్రకటన చేశారు. మరోవైపు.. ట్రేడ్ డీల్ నుంచి రక్షణ ఉన్న వ్యవసాయ, పాల ఉత్పత్తుల గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పెద్ద జాబితాను ప్రకటించారు. “అమెరికా నుంచి దిగుమతి అయ్యే సోయాబీన్, మొక్కజొన్న, బియ్యం, గోధుమ, చక్కెర, తృణధాన్యాలు, కోడి, పాల ఉత్పత్తులు, అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, చెర్రీలు, సిట్రస్ పండ్లు, పచ్చి బఠానీలు, చిక్పీస్, పచ్చి సెనగలు, నూనెగింజలు, ఇథనాల్, పొగాకు వంటి ఉత్పత్తులపై సుంకాలకు ఎటువంటి మినహాయింపు లేదు. “పాలు, పాల పొడి, క్రీమ్, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, పన్నీర్ లేదా జున్ను లాంటి వాటిని భారత్ దిగుమతి చేసుకోదు. మన సుగంధ ద్రవ్యాలు సురక్షితమైనవి. భారత్ నుంచి అనేక వ్యవసాయ ఉత్పత్తులు ఎలాంటి సుంకం లేకుండా అమెరికాకు ఎగుమతి అవుతాయి. కానీ అమెరికన్ ఉత్పత్తులకు ఇలాంటి మినహాయింపులేమీ లేదన్నారు చౌహాన్.
భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌లో భారత్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తొలగిస్తున్నట్లు కథనాలు రావడంతో రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ ట్రేడ్ డీల్ ద్వారా భారత్ ‘పూర్తిగా లొంగిపోయిందని’ రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
రైతు సంఘాల వాదనేంటి?
తాత్కాలిక వాణిజ్య ఒప్పందం విషయంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాదనను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తోసిపుచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
”యూకే, న్యూజీలాండ్, యూరోపియన్ యూనియన్‌తో చేసుకున్న ఒప్పందాలలో పాల ఉత్పత్తులు ఇప్పటికే భాగం. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ ఒప్పందం వాణిజ్య మంత్రి అబద్ధం చెబుతున్నారని నిరూపించింది” అని ఎస్కేఎం ఆ ప్రకటనలో పేర్కొంది.
FORMER UNIONS:
సంయుక్త కిసాన్ మోర్చా వాదన ప్రకారం…
మొక్కజొన్నను డీడీజీ అంటే డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్ గా జొన్నతోపాటు పశుగ్రాసంగా అమ్ముతారు. దీనివల్ల అమెరికన్ కంపెనీలకు పశుగ్రాసంపై మార్కెట్ గుత్తాధిపత్యం లభిస్తుంది.అమెరికా ఇప్పటికే మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశానికి ఎగుమతి చేస్తోంది.అమెరికన్ గోధుమలను కిలోకు రూ.18.50 చొప్పున ఎగుమతి చేస్తున్నారు. దీనిని భారత మార్కెట్లలోకి రానిస్తే ఇక్కడి రైతులు నాశనమవుతారు.
జన్యు మార్పిడి ఆహారం, జన్యు మార్పిడి విత్తనాలను ఉచితంగా దిగుమతి చేసుకోవానికి అనుమతించడం వల్ల సహజ సంతానోత్పత్తి దెబ్బతింటుంది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలకు కూడా హాని కలుగుతుంది.సోయాబీన్ నూనె దిగుమతి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇథనాల్ కూడా ఉచితంగా దిగుమతి అవుతుంది.
అమెరికా 18% సుంకం విధించడం, భారతదేశం సుంకాలే లేకుండా చేయడం స్వేచ్ఛా వాణిజ్యం కాదు. 2023-24లో భారతదేశంపై సుంకాలను సున్నా నుండి 3%కి, ఆ తర్వాత 18%కి చేర్చారు. అయితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 30% నుండి 150% వరకు ఉన్న మన సుంకాలను ఇప్పుడు సున్నాకి తగ్గించారు. ఇది భారత వ్యవసాయ మార్కెట్‌ను అమెరికా బహుళజాతి కంపెనీల ఉచ్చులో బంధిస్తుంది.
అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయవద్దని సంయుక్త కిసాన్ మోర్చా ప్రధానమంత్రిని డిమాండ్ చేసింది. సంతకం చేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది. ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెలో చేరాలని రైతులకు ఫోరం పిలుపునిచ్చింది.













