ట్రంప్ కార్డా..? హారిస్ విజయదరహాసమా..?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరు? ఇద్దరు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచార పర్వం చేపట్టడం, పరస్పర విమర్శలతో దూకుడు పెంచడంతో .. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది.కొందరు ట్రంప్ కు తిరుగులేదంటే.. మరికొందరు కమలా గెలుపు ఖాయమంటున్నారు.ట్రంప్ కు వైట్స్ లో బలమైన మద్దతు దక్కుతుంటే.. కమలాకు బ్లాక్స్ , మహిళల్లో మంచి ఆదరణే ఉంది. ఇప్పుడు ప్రత్యర్థుల ఓటు బ్యాంకును దెబ్బతీసి తాము గెలవడంపై ట్రంప్, కమలా హ్యారిస్ ఫోకస్ పెట్టారు.
ఇప్పటి వరకు ఎవరికి వారు ప్రచారం చేసుకున్న ఇద్దరు నేతలు.. సెప్టెంబర్‌లో ముఖాముఖి తలపడబోతున్నారు. ఈమేరకు సిద్ధమవుతున్నారు. ట్రంప్‌కు తులసీ గబార్డ్ డిబేట్ గురించి శిక్షణ ఇస్తున్నారు. చర్చావేదికలలో తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టడంలో తులసికి ఘన చరిత్ర ఉంది. ఆ ప్రతిభే ఆమెను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘డిబేట్’ అనేది కీలక ఘట్టం. ఓటర్ల అభిప్రాయాలు, ఆలోచనలను ప్రభావితం చేసే చర్చావేదిక. వచ్చే నెలలో జరగబోయే డోనాల్డ్ ట్రంప్– కమలా హారిస్ డిబేట్ కోసం ట్రంపు శిక్షణ ఇస్తున్న మహిళగా తులసి వార్తల్లోకి వచ్చింది. కమలా హారిస్ ను ఎదుర్కోవడానికి సిద్దమవుతున్న ట్రంప్‌కు తులసికి ఉన్న బహుముఖ ప్రజ్ఞ, ఆమె బృందంలోని ప్రతిభ విలువైన ఆస్తులుగా కనిపిస్తున్నాయి.
ఇక కమలా హారిస్‌కు ఎన్నికల్లో బలమైన సలహదారుగా మాయ హారిస్ ఉంది. ఎన్నికల ప్రసంగాలు ఫక్తు ప్రసంగాల్లాగే ఉండనక్కర్లేదు అనేలా మాయా ప్రసంగాలు ఉంటాయి. కమలా హారిస్ చెల్లెలు మాయా హారిస్‌కు తన ప్రసంగాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కుటుంబ బంధాల్లో నుంచి చెప్పొచ్చు. ఆమె ప్రసంగాలలో తన తల్లి ప్రస్తావన ఉంటుంది. ఆమె తన తల్లి గురించి చెప్పే భావోద్వేగపూరిత ప్రసంగాలు ట్రంప్‌పై చేసే రాజకీయ విమర్శల కంటే బలమైన ప్రభావం చూపుతాయి. ఆ అద్భుత నైపుణ్యమే మాయను అక్క కమలా హారిస్‌కు అడ్వైజర్‌ను చేసింది.
ట్రంప్ సలహాదారుగా తులసీ
‘హూ ఈజ్ షీ’ అని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తులసి గబార్డ్ గురించి ఆరా తీస్తున్నారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సమోవా – అమెరికన్, రాజకీయ నాయకుడు. తల్లి కరోల్ పోర్టర్ ఇండియానా రాష్ట్రంలో పుట్టింది. టీవేజీలో హిందూమతాన్ని స్వీకరించింది. హిందూమతంపై ఆమెకు ఉన్న ఆసక్తితో కుమార్తెకు ‘తులసి’ అని పేరు పెట్టింది. సెప్టెంబర్ 10న ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరగనుంది. ఇద్దరు అభ్యర్థులు ఒకరినొకరు సవాలు చేసుకోవడానికి, పైచేయి సాధించడానికి సిద్దమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన ప్రిపరేషన్‌కు సంబంధించి తులసి, ఆమె బృందం సహాయం తీసుకున్నాడు డోనాల్డ్ ట్రంప్. తులసి సహాయంతో కమలా హారిస్‌పై పై చేయి సాధించి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని, ఓటర్లను ప్రభావితం చేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాజకీయ చరిత్రలో ఉత్తమ వక్తలలో ఒకరిగా ట్రంప్ గుర్తింపు పొందాడు. ఆయనకు డిబేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. అయితే గతంలో కమలా హారిస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్న తులసి గబార్డ్ లాంటి గౌరవ సలహాదారుల అవసరం ఎంతో ఉంది అంటున్నారు ట్రంప్ సన్నిహితులు.
కమలకు మాయ సలహాలు..
చికాగోలో జరిగిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో అక్క కమలా హారిస్‌కు మద్దతుగా మాట్లాడిన మాయా హారిస్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తన ప్రసంగంలో భారతీయురాలైన తన తల్లి డాక్టర్ శ్యామల గోపాలన్‌ను స్మరించుకుంది. ‘అమ్మ స్వయం నిర్ణయాధికార శక్తి మాకు స్ఫూర్తి, మేము స్వతంత్రంగా ముందడుగు వేయడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. ఈ హాల్లో అమ్మ ఉండి ఉంటే అక్కను చూసి ఎంత సంతోషించేది. నాకు తెలుసు… ఆమె దివి నుంచి చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదిస్తుంది.‘ అని పేర్కొంది మాయ. మొత్తంగా ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు తమ డిబేట్‌కు సిద్ధమవుతున్నారు.






