ట్రంప్ బర్త్ డే ఖర్చు రూ.500కోట్లు.. కేజ్ ఫైట్ కు ఏర్పాట్లు..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టిన రోజుకోసం ..ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఏకంగా అధ్యక్షభవనంలో యూఎఫ్ సీ(UFC) కేజ్ ఫైట్ నిర్వహించనున్నారు. జులై 14 రాత్రి నిర్వహించే ఈ ఈ వెంట్ కు ఏకంగా 500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ట్రంప్ 80 వ పుట్టినరోజు పురస్కరించుకుని.. ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని (జులై 4) పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ‘యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250’ అని పేరు పెట్టారు.
ట్రంప్ మనసెరిగి..
యూఎఫ్‌సీ అంటే.. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ పోటీలంటే ఎంతో ఇష్టం. గతంలో చాలా ఈవెంట్లను ప్రత్యక్షంగా వీక్షించారు. యూఎఫ్‌సీ సీఈవో డానా వైట్ (Dana White) కూడా ట్రంప్‌నకు సన్నిహితుడు. వీరి స్నేహానికి ప్రతీకగానే వైట్‌హౌస్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి జరిగే ఫ్రీడమ్ 250లో (UFC Freedom 250) పలు దేశాలకు చెందిన ప్రముఖ ఫైటర్లు తలపడనున్నారు.
ఆకర్షణీయంగా ‘ది క్లా’(THE CLAW)..
యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250 ఈవెంట్ కోసం వైట్‌హౌస్ సౌత్ లాన్ ముస్తాబైంది. ‘ది క్లా’ (The Claw) పేరుతో భారీ వేదికను రూపొందించారు. 92 అడుగుల ఎత్తు, 154 అడుగుల వెడల్పు, 600 టన్నుల భారీ స్థాయిలో తాత్కాలిక పైకప్పును నిర్మించారు. వేదిక మధ్యలో యూఎఫ్‌సీ ఆక్టాగాన్ (కేజ్)తోపాటు మూడు నుంచి నాలుగు వేల మంది అతిథులు కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది సామాన్యులు చూసేందుకు వైట్‌హౌస్ బయట కూడా భారీ స్క్రీన్లు పెట్టారు. అయితే, ఈఫిల్ టవర్ మాదిరిగా ఈ తాత్కాలిక నిర్మాణం శాశ్వతంగా ఉండిపోయే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు.
ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో యూఎఫ్‌సీ పోటీలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర విమర్శలకు కారణమైంది. ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేటు క్రీడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఇందులో జోక్యం చేసుకోవడానికి స్థానిక డిస్ట్రిక్ట్ కోర్టు నిరాకరించింది. మరోవైపు, వైట్‌హౌస్ ఈ కార్యక్రమాన్ని సమర్థించుకుంది. దీని నిర్వహణ ఖర్చును యూఎఫ్సీనే భరిస్తోందని స్పష్టం చేసింది.








