ఆ అమ్మాయిలతో వివాహం సులభమే
విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితుల్లో తమ కంటే పై స్థాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పురుషులకు ప్రస్తుతం చాలా సులభమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు కారణం ఇటీవల కాలంలో ఉన్నత చదువులు చదవిని అమ్మాయిల సంఖ్య అబ్బాయిలను మించిపోవడమేని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తద్వారా తక్కువ విద్యార్హత కలిగి అబ్యాయిలను కూడా అమ్మాయిలు వివాహమాడుతున్నారని పేర్కొన్నారు. పెళ్లిళ్లు, తదనంతరం ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించినట్లు అమెరికాలోని కన్సాస్ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ చాంగ్వాన్ కిమ్ తెలిపారు. ఇందులో భాగంగా 1990, 2000లో నిర్వహించిన అమెరికా జనాభా లెక్కలతోపాటు 2009-2011 అమెరికన్ కమ్యూనిటీ సర్వేకు సంబంధించిన డేటాను పరిశీలించినట్లు చెప్పారు. వివాహం అనంతరం భర్త కంటే భార్య సంపాదనే అధికంగా ఉందని అధ్యయనంలో తేలినట్లు కిమ్ పేర్కొన్నారు. కుటుంబంలో అందరి కంటే ఎక్కువ ఆదాయం భార్య నుంచే వస్తోందని తెలిపారు. దీనికి కారణం భార్య ఉన్నత విద్యార్హత కలిగి ఉండటమేనని పేర్కొన్నారు. తద్వారా పురుషులకు పనిచేయడం ద్వారానే కాకుండా పెళ్లి అనంతరం భార్య రూపంలో సంపాదన పెరుగుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.








