జపాన్ కంపెనీలకు అమరావతి కేంద్రం
జపాన్ కంపెనీలకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) సంస్థ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల మంత్రి యోసుకా టకగీ అమరావతికి రానున్నారని, ఈలోపు ఐసీటీ, స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్ నగరాలకు బృహత్తర ప్రణాళికలను పూర్తి చేయాలని సూచించారు. భారత్‌లో జపాన్ కంపెనీలన్నిటికీ అమరావతి ప్రధాన కేంద్రం కావాలన్నారు. జపాన్‌కు చెందిన జైకా, మేటీ సంస్థలు రాజస్థాన్, హరియాణ రాష్ట్రాల్లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రిని కలిసిన జపాన్ ప్రతినిధుల బృందంలో జైకా సీనియర్ ఉపాధ్యక్షులు ఎజిమా షిన్వా ఉన్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణకిశోర్ తదితరులు పాల్గొన్నారు.








