బ్రాడ్ బ్యాండ్ విస్తృతికి గూగుల్ ఎక్స్ సహకారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గూగుల్ ఎక్స్ ముందుకొచ్చింది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ను విస్తృతం చేసేలా సహకారం అందించేందుకు సంసిద్ధత తెలిపింది. గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. మారుమూల ప్రాంతాలకూ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే విషయంలో సహకారం ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి గూగుల్ ఎక్స్ ప్రతినిధులను కోరగా వారు ఇందుకు సుముఖత తెలిపారు.
ముఖ్యమంత్రి బృందం గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించింది. గూగుల్ ఆవిష్కరణలకు ఈ ప్రాంతం నెలవు కావడంతో సాధరణంగా ఇక్కడకు అందరికీ ప్రవేశం వుండదు. గూగుల్ డ్రైవర్ లెస్ కార్, గూగుల్ గ్లాసెస్, బెలూన్స్ ఉపయోగించి ఇంటర్నెట్ అందించడం వంటి ప్రయోగాలకు ఇదే వేదిక. గూగుల్ ఎక్స్ సీఈఓ అస్ట్రో టెల్లర్ తన ప్రజంటేషన్ ద్వారా మరిన్ని వివరాలు తెలిపారు. ఈ తరహా ఆవిష్కరణలకు, వినూత్న ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదిక చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.








