జంతర్ మంతర్ వేదికగానే తాజాగా మరో ఉద్యమం షురూ
మొన్నటి వరకూ నీట్ పేపర్ లీకేజీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో జంతర్ మంతర్ అట్టుడికిపోయింది. ఇది దేశ వ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. ఈ సందర్భంగా నిరసనకారులపై పెల్లెట్ గన్స్ ప్రయోగం, లాఠీచార్జీలు కూడా జరిగాయి.దీనిపై సుప్రీం కోర్టు ఉన్నత స్థాయి కమిటీ కూడా వేసింది. అయితే.. తాజాగా అదే జంతర్ మంతర్ వేదికగా మరో ఉద్యమం కూడా తాజాగా ప్రారంభమైంది.
ఆ ఉద్యమమే ‘‘రిజర్వేషన్ హఠావో’’ ఉద్యమం. రిజర్వేషన్ హఠావో పేరుతో ఆందోళనలు చేపట్టారు. బిహార్, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో పలువురు రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేయగా, కొందరు ఆర్థిక అసమానతల ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించాలన్నారు. సుమారు 5.4 మిలియన్ల ఫాలోవర్లున్న ఓ ఇన్స్టాగ్రామ్ పేజీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది.
జంతర్ మంతర్లో ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రిజర్వేషన్ హఠావో ఆందోళన్ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల వరకు రామ్లీలా మైదానంలో నిర్వహించుకునేందుకు తొలుత అనుమతిచ్చారు. కానీ ఒకరోజు ముందు నిరసన వేదికను మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు జంతర్ మంతర్లోనే శాంతియుతంగా ఆందోళన చేపడతామని నిరసనకు నాయకత్వం వహిస్తున్న అభిషేక్ అగ్నిహోత్రి చెప్పారు.








