కశ్మీర్ భారత్ లో అంతర్భాగమే అన్న అమెరికా..! బాధ్యతా రాహిత్యమన్న పాక్..!
మిత్రదేశం పాకిస్తాన్ కు అమెరికా గట్టి షాకిచ్చింది. కశ్మీర్ పర్యటనలో భాగంగా భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్.. కీలక ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఇక్కడికి రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న తొలి అమెరికా రాయబారి ఆయనే కావడం విశేషం.
శ్రీనగర్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ తర్వాత సెర్గియోగోర్.. పాకిస్తాన్ కు షాకిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “భారత్‌లో ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. నేను ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఇది ఎంతో రమణీయమైన ప్రదేశం” అని కొనియాడారు. కశ్మీర్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో, అమెరికా పౌరుల కోసం జారీ చేసిన ప్రయాణ హెచ్చరికలను (ట్రావెల్ అడ్వైజరీ) సడలించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పలువురు అమెరికన్లు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు.
అయితే…భారత్‌లో జమ్మూకశ్మీర్ ముఖ్య భాగమంటూ అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ (Pakistan)ఖండించింది. ఈ వ్యవహారంలో స్థానిక అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. ఆయన్ను విదేశాంగశాఖ కార్యాలయానికి పిలిపించి.. ఈ అంశంపై తీవ్ర నిరసన తెలిపినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
జమ్మూకశ్మీర్‌పై సెర్గియో గోర్ వ్యాఖ్యలపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘‘భారత్‌లోని అమెరికా రాయబారి బాధ్యతారాహిత్య ప్రకటన చేశారు. ఈ ప్రాంతం విషయంలో అమెరికా (USA) దీర్ఘకాలంగా పాటిస్తున్న వైఖరికి విరుద్ధంగా ఉంది. జమ్మూకశ్మీర్ ఓ వివాదాస్పద భూభాగం. భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తుది పరిష్కారం కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యవహారంలో అమెరికా ప్రకటనలు తదనుగుణంగా ఉండాలని దౌత్యవేత్తను కోరాం’’ అని తెలిపింది.








