ప్రభుత్వం పన్నిన కుట్రకు ఇది భారీ ఎదురు దెబ్బ : ప్రియాంక గాంధీ
లోకసభలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ప్రజాస్వామ్యానికి పెద్ద విజయం’’ గా అభివర్ణించారు. ఈ పరిణామం ప్రతిపక్ష ఐక్యతా బలాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. తాము అధికారంలోక కొనసాగడానికి అధికార పక్షం పన్నిన కుట్రకు ఇది గట్టి ఎదురు దెబ్బ అని దెప్పిపొడిచారు. అలాగే సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా సాధించిన విజయం కూడా అని చెప్పుకొచ్చారు.
అది మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లే కాదని, అది నియోజకవర్గాల పునర్విభజన గురించే అని ప్రియాంక ఎదురు దాడికి దిగారు. అసలు కేంద్ర ప్రభుత్వానికి ఇంత హడావుడి ఎందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ హడాహుడిని చూసి తామంతా ఆశ్చర్యపోయామని, అలాగే ఈ ప్రత్యేక సమావేశాలు కూడా ఇంత అకస్మాత్తుగా జరగడం అందరికీ ఆశ్యర్యం కలిగించిందన్నారు.
సభలో బిల్లు వీగిపోయిన ఫలితం అధికార పార్టీకి సంబంధించిన నేతలందరి ముఖాలలో స్పష్టంగా కనిపిస్తూనే వుందని ప్రియాంక దెప్పిపొడిచారు. మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఓ వ్యూహం ప్రకారమే ఈ బిల్లులను ప్రవేశపెట్టిందని, అధికారంలో కొనసాగేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారని, ఎలాగైనా సరే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న కుట్రతోనే ఇలా చేశారని మండిపడ్డారు.
అలాగే ఈ పరిణామాల ద్వారా వచ్చే ఫలితం ఏదైనా.. తామే ఆ ఘనతను దక్కించుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహం అని చెప్పుకొచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అది తమ విజయమని, ఒకవేళ ఆమోదం పొందకపోయినా అది కూడా తమ విజయమేనని భావించారని అన్నారు. దీని ద్వారా తాము మహిళా పక్షపాతులమని నిరూపించాలని ఇదంతా చేశారని విమర్శించారు. కానీ అది అంత సులభం కాదన్నారు. అయితే ఈ సమస్య మహిళా రిజర్వేషన్ కు అతీతమైందని, ఈ పరిణామం అధికార పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని, వారికి చీకటి రోజు అనిఅన్నారు.
అయితే.. ప్రతిపక్షం మాత్రం మహిళా రిజర్వేషన్లకు ఎంత మాత్రమూ వ్యతిరేకం కాదని ప్రియాంక తేల్చి చెప్పారు. అయితే ప్రభుత్వం ఉద్దేశ్యాన్ని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. అయితే.. ఉన్నావ్ ఘటనలో, హత్రాస్ ఘటనలు, మణిపూర్ ఘటనలు కూడా జరిగాయని, అప్పుడు మహిళల పక్షాన ఎవరు మాట్లాడారు? అంటూ ప్రియాంక సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు.








