ఏ ప్రపంచంలో బతుకుతున్నావ్?.. రాహుల్పై మోదీ వ్యంగ్యాస్త్రాలు!
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ పరోక్షంగా చురకలేశారు. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండానే ఆయన్ను మోదీ ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఒక సభలో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోగ్రాంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. దీనిపైనే మోదీ స్పందించారు. ‘‘ఒక కాంగ్రెస్ పెద్ద మనిషి మాట్లాడుతూ.. దేశంలో అందరి దగ్గర ‘మేడ్ ఇన్ చైనా’ మొబైల్ ఫోన్లే ఉన్నాయని అన్నాడు. అరే పిచ్చోళ్ల లీడరా! అసలు ఏ ప్రపంచంలో బతుకుతున్నావో నీకైనా తెలుసా? ఈ కాంగ్రెస్ లీడర్లకు ఉన్న జబ్బు అదే. ఈ దేశ ప్రజలు ఏం సాధించినా దాన్ని వాళ్లు గుర్తించలేరు’’ అని మోదీ ఎద్దేవా చేశారు. అక్కడితో ఆగకుండా సదరు కాంగ్రెస్ లీడర్ ఏ దేశపు లెన్స్ పెట్టుకొని చూస్తున్నాడో తెలియదని, అతనికి ఈ దేశంలో ఏం జరుగుతుందో ఇసుమంతైనా తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ మ్యానుఫాక్చర్గా భారత్ ఎదిగిందని మోదీ చెప్పారు.













