లుకలుకల మధ్య నేడు ఇండియా కూటమి భేటీ
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా నేడు విపక్ష ఇండియా కూటమి సమావేశం కానుంది. ‘ఇండియా జన్బంధన్’ పేరుతో కీలక సమావేశం నిర్వహించనుంది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించే ఈ సమావేశానికి 23 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలపై బలమైన ప్రజా పోరాటాలు చేయాలన్న ఎజెండాను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అయితే.. తమిళనాడు, పంజాబ్ రాజకీయాల నేపథ్యంలో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే, కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ఈ సమావేశానికి రావడం లేదు. త్వరలోనే జరిగే పలు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు, ఇండి కూటమిగా కలిసి పోటీ చేయడమా? లేక విడివిడిగనా? అన్న అంశాన్ని కూడా చర్చించనున్నారు.
‘‘భారత దేశం మాదిరిగా.. ‘ఇండియా జన్బంధన్’ తన వైవిధ్యంతో ఐక్యంగా ఉంది.’’ అని సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు. జైరాం రమేశ్ పోస్టును ట్యాగ్ చేసిన టీఎంసీ ఎంపీ డెరక్ ఒబ్రెయిన్.. ‘‘ఇండియా ఐక్యంగా ఉంది. ఒకే లక్ష్యం. స్పష్టమైన ఉద్దేశం ఉంది. అన్నిపార్టీలూ ఈ సమావేశం కోసం ఎదురు చూస్తున్నాయి’’ అన్నారు.
అయితే.. కేజ్రీవాల్ కావాలనే ఈ ఇండియా కూటమికి దూరంగా వుంటున్నట్లు తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. తాము ఇకపై ఇండి కూటమిలో భాగస్వామ్య పక్షం కాదని, ఆప్ తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ మాజీ సీఎం దీదీతో ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ అదే ఢిల్లీలో వేరుగా భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించుకున్నారు.
అధికారంలో వున్నప్పుడు దూరంగా దీదీ…
బెంగాల్ లో అధికారంలో వున్న సమయంలో దీదీ.. ఈ ఇండియా కూటమి భేటీలను చాలా లైట్ గా తీసుకున్నారు. పలు మార్లు ఈ ఇండి కూటమి సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎప్పుడైతే అధికారానికి దూరమయ్యారో.. వెంటనే ఈ సమావేశానికి హాజరు కావడానికి ఢిల్లీ చేరుకున్నారు. మరో వైపు సీపీఎం కూడా ఈ సమావేశానికి వస్తుందా? అన్నది అనుమానంగానే వుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం ఢిల్లీలో జరగనుంది.
మరో వైపు ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ నుంచి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ నుంచి అఖిలేష్, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ (పవార్ వర్గం) నుంచి సుప్రియా సూలే, సీపీఐ నుంచి డి. రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, శివసేన ఉద్ధవ్ వర్గం, జేఎంఎం సహా పలు పార్టీలు హాజరుకానున్నాయి.








