మణిపూర్ లో మళ్లీ హింస..
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం ఇంఫాల్ లో మైతీ సామాజిక వర్గానికి చెందిన కోఆర్డినెంటింగ్ కమిటీ ఆన్మణిపూర్ ఇంటెగ్రిటీ కమిటీ నిర్వహించిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. రెండు రోజులుగా కుకీ, నాగా తెగల మధ్య ఘర్షలు చెలరేగిన విషయం తెలిసిందే.మణిపూర్ ముఖ్యమంత్రి ఖేమ్ చంద్ సింగ్ నివాసం వైపు వెళ్లేందుకు ఈ పాదయాత్ర నిర్వాహకులు ప్రయత్నించారు. ఇంఫాల్ మధ్య ప్రాంతంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు నిరసనకారులకు వార్నింగ్ ఇచ్చారు. వెంటనే వెనక్కి మళ్లిపోవాలని వార్నింగ్ ఇవ్వగా.. నిరసనకారులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. పోలీసులు టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారు.
ఇక.. ద కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ముల్లామ్, షోంగ్ఫల్ గ్రామాల్లో కుకీ తెగవారు ఉంటారు.వీరి నివాసాలపై శుక్రవారం ఉదయం నాగా తెగవారు ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో కుకీ తెగకు చెందిన ఇద్దరు మరణించారు. పలువురు మహిళలు, పిల్లలు గాయపడ్డారు. వీరంతా నిద్రలో ఉండగా ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో కొన్ని ఇండ్లను కూడా దుండగులు తగులబెట్టారు. ఈ దాడుల్ని ఎదుర్కొనే క్రమంలో, తమ ప్రాణాల్ని రక్షించుకునేందుకు గ్రామస్తులు ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో నాగా తెగకు చెందిన ఒక వ్యక్తి మరణించాడు. అయితే, కుకీ తెగలవారు చేసిన ఈ ఆరోపణల్ని నాగా తెగ సెంట్రల్ కమాండ్ గార్డ్స్ ఖండించారు. తమ తెగకు చెందిన దళాలు గస్తీ విధులు నిర్వర్తిస్తుండగా.. కుకీ తెగకు చెందిన వారు దాడి చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు.
అక్కడకు వెళ్లిన తర్వాత కుకీ తెగవారు కాల్పులు జరపడంతో ఒక నాగా తెగ వాలంటీర్ మరణించాడని, మరో నలుగురికి గాయాలయ్యాయని చెప్పారు. దీంతో తాము కూడా ఎదురుకాల్పులు జరిపామన్నారు.
అయితే.. శనివారం చెలరేగిన అశాంతిపై కొకోమీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ర్యాలీ ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నిర్వహించారని, అందులో ప్రాక్సీవార్, నార్కో టెర్రరిజం, హత్యలు, సీఆర్పీఎఫ్ కాల్పుల్లో మరణించిన ఘటనపై న్యాయవిచారణ వంటి అంశాలున్నాయని తెలుస్తోంది. 2023 మే నుంచి జరిగిన పరిణామాలు, తాజా ఘటనల నేపథ్యంలో ప్రజలు భారీగా బయటికి వచ్చారనికోకోమీ ప్రతినిధులు అంటున్నారు.
ఇక.. ఈ నెల మొదటి వారంలోనే మణిపూర్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అల్లర్లు చెలరేగాయి. దీంతో ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబాల్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. బిష్ణుపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఉగ్రవాదులు రాకెట్ దాడి చేశారు. ఈ పేలుడులో 5 ఏళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనతో ప్రజలు ఆగ్రహంతో నిరసనలకు దిగారు. గొడవలు పెద్దవి కాకుండా ఉండటానికి బిష్ణుపూర్‌లో ప్రభుత్వం వెంటనే కర్ఫ్యూ విధించింది. ఇప్పటికే మైతేయ్, కుకీ వర్గాల మధ్య గొడవలతో అశాంతిగా ఉన్న మణిపూర్‌లో, ఈ దాడి పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చింది. పిల్లల మరణవార్త విన్న స్థానికులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న రెండు ఆయిల్ ట్యాంకర్లకు, ఒక లారీకి నిరసనకారులు నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్ బయట టైర్లను తగలబెట్టడమే కాకుండా, అక్కడ ఉన్న ఒక తాత్కాలిక పోలీస్ అవుట్‌పోస్ట్ ధ్వంసం చేశారు.








