అలాంటివారికి మాస్కు నుంచి రక్షణ …

ముఖానికి ధరించే మాస్కుల ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటమే కాకుండా ఇతర ప్రయోజనాలూ ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం పేర్కొంది. మాస్కుల లోపల చెమ్మ ఏర్పడటం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో తేమ నెలకొంటుందని తెలిపింది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని వివరించింది. అలాంటివారికి తీవ్రస్థాయి కరోనా ఇన్‍ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొంది. అమెరికాలోని నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ (ఎన్‍ఐడీడీకే) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
మాస్కులు ధరించడం వల్ల శ్వాసించే గాలిలో తేమ బాగా పెరుగుతుందని చెప్పారు. తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్లూ తీవ్రత తగ్గుతుందని ఇప్పటికే వెల్లడైంది. కొవిడ్ విషయంలో ఇది వర్తిస్తుంది. అధిక తేమ వల్ల మ్యూకోసీలియరీ క్లియరెన్స్ (ఎంసీసీ) అనే పక్రియ చోటుచేసుకుంటుంది. ఈ పక్రియ ఊపిరితిత్తుల్లోని శ్లేష్లాన్ని, అందులోని హానికారక రేణువులను తొలగిస్తుంది. అలాగే వైరస్‍లపై పోరాడే ఇంటర్‍ఫెరాన్ అనే ప్రత్యేక ప్రొటీన్లను విడుదల చేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. తేమ తక్కువగా ఉంటే ఎంసీసీ, ఇంటర్‍ఫెరాన్ స్పందన తక్కువగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. శీతాకాలంలో తేమ తక్కువగా ఉండే సమయంలో శ్వాసకోశ ఇన్‍ఫెక్షన్లు ఎక్కువగా చెలరేగడానికి కారణం ఇదే కావొచ్చని చెప్పారు.