Covid: కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోందా…?

కరోనా వైరస్.. ఈ పేరు వింటే చాలు అందరి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అంతలా ప్రభావం చూపిందీ వైరస్ ప్రపంచంపై. నానా పాట్లు పడి, వ్యాక్సీన్లు వేసుకుని మరీ.. ఎట్టకేలకు అందరూ బయటపడ్డారు. ఆ సంతోషం మూన్నాళ్లముచ్చటేనా అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే…తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లను భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో బయటపడగా.. ఎల్‌ఎఫ్.7 కు సంబంధించి నాలుగు కేసులు మేలో గుర్తించినట్లు తెలిపింది. అవి తమిళనాడు, గుజరాత్‌లో నమోదయ్యాయి.
ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులను గుర్తిస్తున్నారు. మూడేళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకిందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. దాంతో అన్ని ప్రభుత్వాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది (Covid surge).
ఇటీవల కాలంలో ఆసియా దేశాలు మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు.
ఢిల్లీలో కేసులతో అక్కడి బీజేపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యత సరిచూసుకోవాలని సూచించింది. వివిధ రకాల శ్వాసకోశ వైరస్ కేసుల వివరాలను పొందుపర్చాలని ఆదేశించింది. వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతోపాటు ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఆసియా దేశాల్లో కొవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న జేఎన్.1 రకం ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం (Variant of Concern) కాదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇదివరకే స్పష్టం చేసింది.