బైడెన్ బృందంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు : ఫైజర్
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, సరఫరాలపై అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ అధికార మార్పిడి (ట్రాన్సిషన్) బృందంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని వ్యాక్సిన్ తయారీ సంస్థ ఫైజర్ వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ అధికార ప్రతినిధి షారన్ కేస్టీలో మాట్లాడుతూ ఈ పక్రియలో రాజకీయాలకు తావు లేదని వ్యాఖ్యానించారు. నూతన అధికార యంత్రాంగానికి అధికార బదిలీకి సంబంధించి ట్రంప్ ప్రతిష్ఠంభన కొనసాగిస్తుండంతో ఫైజర్, ఇతర వ్యాక్సిన్ తయారీదారులతో అధికార మార్పిడి బృందం కలుసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు బైడెన్ ఛీప్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెన్ గత ఆదివారం వెల్లడించారు. క్లెన్ బుధవారం మాట్లాడుతూ ఫైజర్ ట్రంప్ అధికార యంత్రాంగంతోను, గవర్నర్లు, రెండు పార్టీల చట్టసభ్యుల తోను కూడా సంప్రదింపులు సాగిస్తోందని చెప్పారు. బైడెన్, ఫార్మాసంస్థల చీఫ్‌లతో అధికారిక సమావేశం గురించి ఇంకా ఎలాంటి ప్రస్తావన లేదని తెలిపారు.






