కరోనా టీకా పంపిణీ ఆలస్యమయ్యే ప్రమాదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో అధికార బదిలీ పక్రియలో చోటు చేసుకుంటున్న జాప్యంపై నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల కరోనా టీకా పంపిణీ ప్రణాళిక అమలు కొన్ని వారాలు లేదా నెలల పాటు ఆలస్యమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనాపై ఆరోగ్య నిపుణులతో గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజేతను గుర్తించి, తనకు ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని తెలుసుకునే అధికారాలను అందించే జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) వ్యవస్థ విఫలమైందని బైడెన్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలు, నిల్వలు లాంటి కీలక సమాచారం తమకు తెలియడం లేదన్నారు.
కరోనా టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, దాన్ని 30 కోట్లకు పైగా ఉన్న అమెరికన్లనకు ఎలా పంపిణీ చేస్తారు, తొలి ప్రాధాన్యం ఎవరికిస్తారు, దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి అన్న విషయాలు తమకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండు సంస్థలు కరోనా టీకాకు సంబంధించి దాదాపు 95 శాతం సత్ఫలితాలు సాధిస్తున్న ప్రస్తుత తరుణంలో అది చాలా కీలకాంశమని పేర్కొన్నారు.






