దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

దేశంలో కరోనా ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒకేసారి 17,407 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు (14,989 కేసులు)తో పోల్చుకుంటే నేడు భారీ తేడా కనిపించింది. ప్రస్తుతం మొత్తం వైరస్ కేసుల సంఖ్య 1.11 కోట్లుకు పైబడింది. అయితే, మూడురోజు కూడా మరణాల సంఖ్య 100కు దిగువనే నమోదు కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. కొత్తగా 89 మంది మృత్యుఒడికి చేరగా, నిన్నటి వరకు 1,57,435 మంది ఈ మమ్మామారి కారణంగా ప్రాణాలు వదిలారు.
పాజిటివ్ కేసుల పెరుగుదల కారణంగా క్రియాశీల కేసుల్లో వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1,73,413 మంది కరోనాకు చికిత్స తీసుకుంటుండగా, క్రియాశీల రేటు 1.53 శాతంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 14,031 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారు 1.08 కోట్లకు పైబడగా.. ఆ రేటు 97.06 శాతంగా కొనసాగుతోంది. నిన్న 7,75,631 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.