ఏపీలో కొత్తగా 5,653 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 73,625 కరోనా పరీక్షలు చేయగా 5,653 మందికి కరోనా బారినపడగా.. 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,50,517కు చేరింది. గడిచిన 24 గంటల్లో 6,659 మంది కొవిడ్ నుంచి కోలుకోగా మొత్తంగా 6,97,699 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,194 మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా 46,624 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 64,94,099 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరులో ఐదుగురు చనిపోయారు. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరు, విశాఖలో ముగ్గురు చొప్పున కొవిడ్‌కు బలయ్యారు. అనంతపురం, గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.






