పవర్ క్రైసిస్.. రేవంత్ సర్కార్‌కు సవాల్!
తెలంగాణలో విద్యుత్ రంగం మరోమారు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని కీలకమైన థర్మల్ పవర్ స్టేషన్లలో తలెత్తిన బొగ్గు కొరత, జల విద్యుత్ ఉత్పత్తిలో మందగమనం రేవంత్ రెడ్డి ప్రభుత్మానికి పెను సవాల్‌గా మారుతున్నాయి. ఎన్నికల హామీల అమలుతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల్సిన తరుణంలో ఈ పవర్ క్రైసిస్ సర్కార్‌కు తీవ్ర తలనొప్పిగా మారుతోంది.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మొత్తం 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలు లేకపోవడంతో కేవలం 800 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీనికి తోడు నాణ్యత లేని బొగ్గును వాడవలసి రావడం వల్ల ప్లాంట్‌లోని రెండు యూనిట్లలో తీవ్ర సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం.. ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే థర్మల్ ప్రాజెక్ట్‌లలో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే, యాదాద్రి ప్లాంట్‌లో ప్రస్తుతమున్న నిల్వలు కేవలం మూడు నుంచి నాలుగు రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాలపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. సింగరేణి కాలరీస్ వద్ద తగినంత బొగ్గు నిల్వలు, బ్లాకులు అందుబాటులో లేకపోయినప్పటికీ, కేవలం జీ9 గ్రేడ్ బొగ్గును మాత్రమే వినియోగించే టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్‌ను ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయాల వల్లే రవాణా భారం పెరిగి, నేడు బొగ్గు కొరత ఏర్పడిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
ఇవి కూడా చదవండి
మహానది కోల్ కీలిమిటెడ్, కోల్ ఇండియా నుంచి అదనంగా 5 మిలియన్ టన్నుల బొగ్గును కేటాయించాల్సిందిగా ఆగస్టు నెలలోనే టీజీ జెన్కో కేంద్ర ప్రభుత్వానికి, కోల్ ఇండియాకు లేఖ రాసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ చివరి నాటికి తగినంత బొగ్గును సమకూర్చుకోకపోతే మిగతా ప్రాజెక్టులు కూడా ఇదే దుస్థితిని ఎదుర్కొనే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తక్షణమే బొగ్గును కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దసరా పండుగ నాటికి యాదాద్రి ప్లాంట్‌లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని స్పష్టం చేశారు.
మరోవైపు ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు రేవంత్ సర్కార్ దేశంలోని వివిధ బొగ్గు సరఫరా సంస్థలతో ముమ్మర చర్చలు జరుపుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ విద్యుత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా అధిగమించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది.








