సాయికుమార్‌కు మంత్రి సవిత అభినందన
మార్కాపురంలో ఇటీవల జరిగిన 11వ ఎపి స్టేట్ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డుతో పాటు మూడో ప్లేస్ సాధించి, రాష్ట్రం నుంచి జాతీయ పోటీలకు ఎంపికైన వినుకొండ ఎంజెపి ఎంజెపి బిసి గురుకుల పాఠశాల విద్యార్థి దేవళ్ల సాయికుమార్ (Devalla Saikumar)ను బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత (S. Savitha) అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను వినుకొండ ఎంజెపి బిసి గురుకుల విద్యార్థి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయికుమార్ (Saikumar), కోచ్ జూనా నాయక్ (Juna Naik), ప్రిన్సిపల్ వై రమేష్ ( Y. Ramesh) మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్ బ్యాడ్మింటన్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి చత్తీగఢ్‌లో జరిగే జాతీయ సబ్ జూనియర్స్ పోటీల్లో రాష్ట్రం తరపున పాల్గొననున్నట్లు తెలిపారు. అనంతరం సాయికుమార్‌ను సత్కరించారు.








